West Asia War Effect on Mango Exports: భారత్‌లో మామిడి సీజన్ ప్రారంభమైందంటే ఎగుమతిదారులలో ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది. కానీ, 2026 ఏప్రిల్‌ నెలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా భారతీయ మామిడి ఎగుమతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మేలైన రకాలపై ఆల్ఫాన్సో, కేసర్‌, మన తెలుగు రాష్ట్రాల్లోప్రసిద్ధి చెందిన బంగినపల్లి వంటి రకాల ఎగుమతులకు ఈ యుద్ధం పెద్ద అడ్డంకిగా మారింది.

ఎందుకు ఈ అడ్డంకులు

గత రెండు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధించింది. దీనికి తోడు ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడుల వల్ల ప్రధాన షిప్పింగ్ లైన్లు తమ నౌకలను కేప్ ఆఫ్‌ గుడ్ హోప్‌ మీదుగా మళ్లించాల్సి వస్తోంది. ఈ మార్పు వల్ల ప్రయాణం కాలం విపరీతంగా పెరగడమే కాకుండా ఓడరేవుల్లో రద్దీ పెరిగి కంటైనర్లు సకాలంలో తిరిగి రావడం లేదు.

మామిడి వంటి త్వరగా పాడైపోయే పండ్ల రవాణాకు రీఫర్‌ అని పిలిచే రిఫ్రిజిరేటెడ్‌ కంటైనర్లు అత్యవసరం. ఈ కంటైనర్లలో ఉష్ణోగ్రతను కచ్చితంగా 11 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. భారత్‌ సొంతంగా ఈ రీఫర్ కంటైనర్లను తయారుచేయదు. మనం పూర్తిగా అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లపైనే ఆధాపడుతున్నాం. యుద్ధం కారణంగా ఈ కంటైనర్ల రాకపోకలు మందగించడంతో ప్రస్తుతం మార్కెట్‌లో వీటి కొరత తీవ్రంగా ఉంది.

ఎనిమిది రెట్లు పెరిగిన రవాణా ఛార్జీలు

యుద్ధం కారణంగా రవాణా రంగంపై పడిన ఆర్థిక భారం సామాన్యులను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే సముద్ర రవాణా ఛార్జీలు కొన్ని మార్గాల్లో ఏకంగా 8 రెట్లు పెరిగాయి. యుద్ధం ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణించే నౌకలపై బీమా ఛార్జీలు, అదనపు పన్నులు భారీగా పెరిగాయి. కేవలం మార్చి నెలలోనే రీఫర్‌ కంటైనర్ల ఛార్జీలు వెయ్యి డాలర్లు వరకు పెరిగాయి. కొన్ని మార్గాల్లో సుమారు నాలుగువేల డాలర్ల వరకు అదనపు పన్నులు విధిస్తున్నారు. ఇది సాధారణ రవాణా ఖర్చు కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ.

ఎగుమతులపై ప్రభావం

ప్రపంచ మామిడి ఉత్పత్తిలో భారత్ అగ్రమగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పండే మామిడిలో 44 శాతం అంటే సుమారు 20.68 మిలియన్‌ టన్నులు భారత్ నుంచే వస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ 56.5 మిలియన్ డాలర్ల విలువైన 29,938 టన్నుల తాజా మామిడి ఎగుమతి చేసింది.

మన ఎగుమతుల్లో 40 శాతం నుంచి 45 శాతం వాటా గల్ఫ్‌ దేశాలదే. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే పీక్ సీజన్‌లో ఎగుమతిదారులకు ఇప్పటికే భారీ ఆర్డర్లు ఉన్నాయి. మామిడి పండు కోసిన తర్వాత కేవలం 28 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. సముద్ర మార్గంలో ప్రయాణ కాలం పెరగడం వల్ల పండ్లు గమ్యస్థానానికి చేరే లోపే పాడైపోయే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎగుమతిదారులు విమాన రవాణాను ఎంచుకోవాల్సి వస్తోంది. సముద్ర రవాణా ఖర్చు కేజీకి 50 నుంచి 80 రూపాయలు. విమాన రవాణా ఖర్చు కేజీకి 240 రూపాయల నుంచి 300 రూపాయలు. విమాన రవాణా దాదాపు ఐదు నుంచి ఆరు రెట్లు ఖరీదైనదిగా కావడంతో ఎగుమతిదారుల లాభాలు తగ్గిపోతున్నాయ.

ఈ సంక్షోభం కేవలం ఎగుమతిదారులకే పరిమితం కాలేదు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది పెద్ద దెబ్బ. ఎగుమతులు నిలిచిపోతే, ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్‌కు మళ్లుతాయి. దీని వల్ల దేశీయంగా మామిడి ధరలు భారీగా పడిపోయి రైతులకు కనీస పెట్టబడి పోటీని ఎదుర్కోవడంలో కూడా భారత్ వెనుకబడే అవకాశం ఉంది.

ఈ సమస్య కేవలం మామిడికే పరిమితం కాలేదు. అరటి, ద్రాక్ష, ఉల్లిపాయలు, సీ ఫుడ్ వంటి త్వరగా పాడైపోయే వస్తువులపై కూడా ఈ ప్రభావం పడింది. ముంబైలోని జీఎన్పీటీ ఓడరేవులో వందలాది కంటైనర్లు నిలిచిపోయాయి.