Vizag Food Court Issue: విశాఖలోని జైలు రోడ్‌లోని నైట్ ఫుడ్ కోర్ట్ తొలగింపు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. జీవీఎంసీకి రావాల్సిన రెవెన్యూని అడ్డుకుంటున్నారు అంటూ వైజాగ్ జైలు రోడ్డులోని 160 దుకాణలను తొలగించే ప్రయత్నం చేసింది జీవీఎంసీ. కొన్ని దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా తమ షాపులు తొలగించడానికి ఒప్పుకోగా మిగిలిన దుకాణదారులు రోడ్డుఫై పడుకుని మరీ తమ నిరసన తెలియజేశారు. దానితో పరిస్థితి ఉద్రిక్తం గా మారింది.

సీన్ లోకి జనసేన ఎమ్మెల్యే ఎంట్రీ.. అధికారులఫై ఫైర్

ఇప్పుడీ సీన్‌లోకి వైజాగ్ సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఎంటర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం లేకుండా షాపులు తొలగించడం చాలా బాధాకరమనీ మేయర్ , కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయనీ హెచ్చరించారు. అవసరమైన మేరకు రెంట్స్ ఫిక్స్ చేసి, గుర్తింపు కార్డులు ఇచ్చి, చట్టబద్ధంగా దుకాణదారులకు సపోర్ట్ చేయాలి గానీ పేద ప్రజలకు అన్యాయం చేస్తే సహించేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం జైలు రోడ్లో నిర్వహిస్తున్న ఫుడ్ కోర్ట్ ను తొలగించాలనుకునేటప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని కనీస బాధ్యత జీవీఎంసీ అధికారులకు లేదా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మేయర్, జీవీఎంసీ కమిషనర్ డిసైడ్ అయ్యి ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ అన్యాయంగా ఫుడ్ కోర్ట్ షాపులు తొలగించడాన్ని తీవ్రంగా వంశీకృష్ణ శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలకి సమాచారం ఇచ్చి మళ్లీ తీర్మానం పెడితే ఫుడ్ కోర్టు నిర్వహించేలా తీర్మానాన్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా జీవీఎంసీ మేయర్, కమిషనర్ చేసే ఇలాంటి దుర్మార్గమైన చర్యలు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వ్యాపారాలన్నీ తీసేస్తే రోడ్డును పడ్డ పేద ప్రజలు ప్రభుత్వాన్ని నిందిస్తారే తప్ప మేయర్‌నో కమిషనర్‌నో కాదని గుర్తు చేశారు. ఐటీ రంగంగా కూడా అభివృద్ధి చెందుతున్న నగరంలో జైల్ రోడ్డు నైట్ ఫుడ్ కోర్ట్ లోకి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు.

మిడ్ నైట్ ఎంతోమంది నగర ప్రజలు ఫుడ్ కోర్ట్ కు వస్తున్నారు. అందుబాటు ధరల్లో అన్ని రకాల ఫుడ్స్ ఐటమ్స్ తో కళకళలాడుతూ నగర ప్రజలు చాలా సంతోషంగా ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నప్పటికీ మేయర్, కమిషనర్, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేయడం చాలా బాధాకరం అన్నారు

జీవీఎంసీ అధికారుల వెర్షన్ ఇదీ

జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా పాత జైల్ రోడ్డులో ఫుడ్ కోర్ట్ నందు ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ,ప్రభాకరరావు తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ జోన్ 4 పరిధిలో సౌత్ జైల్ రోడ్ సెంట్రల్ పార్క్ ఆనుకొని సర్వీస్ రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్ట్ నందు 160 దుకాణాలు అనధికారకంగా ఆక్రమణకు పాల్పడి వ్యాపారాలను నిర్వహిస్తున్నారని వాటిని జీవీఎంసీ అధికారులు శుక్రవారం తొలగించే ప్రక్రియలో 60దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు స్వచ్ఛందంగా శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి తొలగించుకున్నారని, మిగిలిన దుకాణాలను స్వచ్చందంగా తొలగించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ ఫుడ్ కోర్ట్ తొలగింపుపై జీవీఎంసీ సమావేశాలలో 2023వ సంవత్సరం నుంచి 2025 ఆగస్టు 22వ తేదీ వరకు వరుసగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరిగాయి. సభ్యుల అంగీకారంతో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు తీర్మానాలు చేశారని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. సర్వీస్ రోడ్డును ఆక్రమించి వ్యాపారస్తులు జీవీఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, అనధికారకంగా ఫుడ్ కోర్ట్స్‌ వల్ల జీవీఎంసీకి ఆదాయం రావడం లేదని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు.

ఫుడ్ కోర్టు నిర్వహణపై ఇప్పటికే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఫుడ్ కోర్ట్ తొలగించాలని , అలాగే కొందరు దుకాణాల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు జీవీఎంసీకి అందాయని తెలిపారు.