Separate Secunderabad Corporation |హైదరాబాద్: సికింద్రాబాద్ ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తామంటూ తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అనైతికంగా డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముక్కలు చేయాలని చూస్తే నిన్ను ముక్కలు చేస్తాం జాగ్రత్త అని ఎమ్మెల్యే తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య ఐక్యతా భావంతో ఉండేవాళ్లం మనం. నార్త్ జోన్ అంటే ప్రశాంతంగా ఉండే ప్రాంతం. మన సికింద్రాబాద్ జోన్ లో మత కల్లోలాలు ఉండవు. చిన్నప్పటి నుంచి అన్నిమతాల వాళ్లం కలిసుండే వాళ్లం. ఈ ప్రాంతాన్ని మీ అబ్బ జాగీరు అన్నట్లుగా ముక్కలు చేస్తామంటే నిన్ను ముక్కులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్

సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ప్రకటించడంతో పాటు, సికింద్రాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) పేరుతో సికింద్రాబాద్‌ను ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతోందని, దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తలసాని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తిగా అశాస్త్రీయంగా, తప్పుల తడకగా ఉందని ఆయన విమర్శించారు. కనీసం నగర మేయర్‌కు కూడా సమాచారం లేకుండా ఈ విభజన జరగడం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.

నిరసనకు సిద్ధమని ప్రకటన

ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 17న నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, ఆపై సికింద్రాబాద్‌లో రైల్ రోకో, బంద్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే నిరవధిక దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనకాడబోమని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్ చారిత్రక గుర్తింపును దెబ్బతీసే చర్యలను అడ్డుకుంటామని తలసాని స్పష్టం చేశారు.