Srikakulam Latest News: రణస్థలం మరో రణానికి వేదికవుతుంది. ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న స్థానికులు దాన్ని తీవ్రతరం చేయబోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రణస్థలంలో బైపాస్ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అయితే అందుకు భిన్నంగా ఫై ఓవర్ నిర్మాణానికి NHAI చర్యలు చేపడుతుంది. ఇప్పటికే రణస్థలంలో ఫ్లై ఓవర్ నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ది సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులు వేగవంతంగా చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.

ఫ్లై ఓవర్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న స్థానికులు ఈశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రెడీ అవుతున్నారు. బై పాస్ సాధించుకోవడమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా పోరాడేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.

రణస్థలం మండల కేంద్రం జె.ఆర్.పురం వద్ద సుమారు రెండున్నర కిలోమీటర్ల పొడవున ఎన్.హెచ్ 16 జాతీయ రహదారి ఉంది. విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు తీసుకుంటే ఈ ఊరి నుంచే ఎక్కువ భాగం జాతీయ రహదారి వెళ్తోంది. పదిహేనేళ్ల క్రితం నాలుగు లైన్‌ల విస్తరణ కోసం భూసేకరణ జరిగింది. వందల మంది ఆస్తులు కోల్పోయారు. ఇప్పుడు ఆరు లేన్ల రోడ్ విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఆరు లేన్ల రహదారికి కనీసం 65 మీటర్ల వెడల్పు అవసరం కానీ జె.ఆర్.పురం వద్ద 45 మీటర్ల మాత్రమే ఉంది. ప్రత్యామ్నయంగా జె.ఆర్.పురం వద్ద బైపాస్ నిర్మాణానికి 66 ఎకరాలు సేకరించాలని నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో అక్కడి భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి.

నష్టపరిహారం చెల్లింపులో రాజకీయ జోక్యం. .
2016-18 సమయంలో భూసేకరణ, రైతులకు నష్టపరిహారం చెల్లింపులో రెవెన్యూ అధికార్లు, ఎన్.హెచ్.ఏ.ఐ అధికార్లు మధ్య సమన్వయం లోపించింది. నాయకులు, రెవెన్యూ అధికార్లను గుప్పెట్లో పెట్టుకొని భూమి విలువ ఎక్కువ నమోదు చేయించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఎన్.హెచ్.ఏ.ఐ అధికార్లు కూడా ఈ ధరలతో విభేదించారు. భూమి విలువ 30శాతం తగ్గించాలని పట్టుబట్టడంతో భూసేకరణ ఆగిపోయింది. రెవెన్యూ అధికార్లు మాత్రం ఫ్రీజింగ్‌లో ఉన్న భూములను రిలీజ్ చేసేసారు. ఇది రెవెన్యూ అధికార్ల వ్యూహాత్మకంగా చేసిందేనని జె.ఆర్.పురం ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పాలనలో
2022-23లో మళ్లీ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం అధికార్లు చర్యలు ప్రారంభించారు. జె.ఆర్.పురం ప్రజలు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వ్యతిరేకించారు. రిలే నిరాహారదీక్షలు చేశారు. అప్పటి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఎం.పి బెల్లాన చంధ్రశేఖర్ ఎన్.హెచ్.ఏ.ఐ అధికార్లతో మాట్లాడారు. ప్రజల అభ్యంతరాలు తెలియజేశారు. భవిష్యత్‌లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగనుందని, ప్రజలు అంగీకరించని పని చేయబోమని అధికార్లు వెనక్కి తగ్గారు. దీంతో ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పనులు నిలిచిపోయాయి.

Also Read: పోర్న్ వీడియోల్లోలానే చేద్దామని ఫోర్స్ - ఆత్మహత్య చేసుకున్న భార్య - విశాఖలో ఘోరం

కూటమి పాలనలో ఫై ఓవర్ నిర్మాణంపై కదలిక
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎచ్చెర్లలో బిజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు ఉన్నారు. అయినా రణస్థలం వద్ద ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు టెండర్లు పిలిచింది. నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫ్లై ఓవర్ వ్యతిరేకిస్తున్న ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నితిన్ గడ్కారీని కలిసి కృతజ్ఞత చెప్పడం వారిని మరింత ఆగ్రహానికి గురి చేసింది. నాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని వ్యతిరేకించిన ప్రస్తుత ఎంపీ ఎం.పి కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు అభివృద్ధి మంత్రం పటిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.

తెరపైకి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలు
ఇప్పుడు ఎన్.హెచ్16కి సమాంతరంగా విశాఖపట్నం నుంచి ఖరగ్‌పూర్ వరకు దాదాపు 745 కిలోమీటర్ల మేర 8 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం కేంద్రం సిద్ధమైంది. టెండర్లు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు త్వరలోనే పనులు ప్రారంభించనున్నాయి. వీటన్నింటితో జె.ఆర్.పురం ప్రజలు రగిలిపోతున్నారు. ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులే మనోభావాలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. బైపాస్ కోసం అప్పట్లో 165 కోట్లు కేటాయించింది ఎన్.హెచ్.ఏ.ఐ. మరో అయిదారు కోట్లు కేటాయిస్తే ప్రక్రియ పూర్తి అయ్యేది. కానీ ఇప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం 235 కోట్లు కేటాయించింది. అంటే బైపాస్ కంటే సుమారు 70 కోట్ల అధికంగా ఖర్చు చేస్తోంది.

ఫ్లై ఓవర్‌పై జనం వ్యతిరేకతకు కారణాలు.
6 లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కనీసం 65మీటర్ల వెడల్పు స్థలం అవసరం. కానీ జె.ఆర్.పురం వద్ద ఉన్నది 45 మీటర్ల వెడల్పు స్థలం. ఈ స్థలంలో ఇరుకిరుకుగా ఫ్లై ఓవర్ నిర్మిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. గ్రామం స్వరూపం మారిపోతుందని, వ్యాపారాలు తగ్గి ఉపాధి కోల్పోతారని, ఇళ్లు, భూముల విలువ తగ్గిపోతాయన్నది జనం ఆవేదన. ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రతిపాదన రాగనే జె.ఆర్.పురంలో భవన నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. వ్యాపార దుకాణాలపై లోన్‌లు తగ్గించేశారు. షాపులు అద్దెకు తీసుకొని వ్యాపారాలు చేసేవారు వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో పెద్ద ఎత్తున ఆర్థిక, ఉపాధి నష్టం జరుగుతుందని అంటున్నారు. అభివృద్దికి ఫుల్ స్టాప్ పడనుందని భయపడుతున్నారు. ఇరుకిరుకు రోడ్‌లు, ట్రాఫిక్‌తో అవస్థలు పడాల్సి ఉంటుందన్న టెన్షన్ పట్టిపీడిస్తుంది. ఈ క్రమంలోనే రణస్థలంలో ఫ్లై ఓవర్‌ను స్థానికులు వ్యతిరేకిస్తూ పోరు ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు.

Also Read: రంగరాజన్‌పై దాడి కేసులో శ్రీకాకుళం వాసుల అరెస్టు- రామదండు పేరుతో జిల్లాలో చేసిన దందాలపై చర్చ