Chhatrapati Sambhaji Maharaj | ఒకప్పుడు దక్షిణాది వంటకం గా పేరు పొందిన సాంబార్ ఇప్పుడు ఇండియా వైడ్ గా పాపులర్. సౌత్ ఇండియన్స్ పుణ్యమా అంటూ విదేశాలకు సైతం పాకి పోయింది. సాంబార్ లేని విందులు పెళ్లిళ్లు ఎక్కడా కనపడవు. అయితే ఇంతకూ సాంబార్ కా పేరు ఎలా వచ్చింది. చత్రపతి శంభాజీ మహారాజు గుర్తుగా "సాంబార్ " అనే పేరు పెట్టారనే ప్రచారంలో నిజమెంత.

కన్నడ ప్రాంతంలో "హులి " వంటకం సాంబార్ కు మూలం

నిజానికి సాంబార్ తొలిసారి గా ఎక్కడ తయారైంది అన్నదానిపై ఖశ్చితమైన ఆధారాలు లేవు.కానీ కర్ణాటకకు చెందిన ప్రముఖ ఫుడ్ హిస్థారియన్ KT అచయా ( 1923-2002) ప్రకారం సాంబార్ కు మూలం కన్నడ వంటకం "హులి " లో ఉంది. 1648 CE లో కన్నడ విద్యావేత్త గోవింద వైద్య రచించిన " కంఠీరవ నరసరాజ విజయ " అనే గ్రంథంలో కందిపప్పు, కూరగాయలు కలిపి వండే సాంబార్ లాంటి వంటకం "హులి " గురించిన ప్రస్తావన ఉంది. "హులి " మాటకి అర్థం పులుపు అని.

శంభాజీ మహారాజ్ పేరు మీదగా సాంబార్

తంజావూర్, మరాఠా ప్రాంతాల్లో మరొక సంప్రదాయం ప్రచారంలో ఉంది. చత్రపతి శంభాజీ మహారాజ్ ఒకసారి మరఠా సంప్రదాయ వంట "ఆమ్తి " (పప్పు ధాన్యాలతో చేసే సూప్ ) లో కొన్ని మార్పులు చేశారు. అందులో వాడే 'కోకుమ్ పండు " కు బదులుగా చింతపండు రసం, కూరగాయలు చేర్చి క్రొత్త వంటకాన్ని తయారు చేశారు. మొఘలుల చేతిలో ఆయన 1689 లో హత్యకు గురయ్యాక ఆయన జ్ఞాపకార్థం శంభాజీకి తమ్ముడు వరసయ్యే తంజావూర్ మహారాజు సాహు (1684-1712) ఈ వంటకానికి సాంబార్ అనే పేరు పెట్టినట్టు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది పాకశాస్త్ర నిపుణుడు సౌరిష్ భట్టాచార్య తన 2023 నాటి పుస్తకం "the Bloomsbury Handbook of Indian Cuisine " అనే పుస్తకంలో దీని గురించి ప్రస్తావించారు. నిజానికి శంబాజీ,సాహూల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి కాదు. కానీ శంభాజీ మరణం తర్వాత రెండు రాజ్యాల మధ్య సత్సంబంధాల కోసం సాహు సాంబార్ ను వాడుకున్నట్టు ఆయన తన పుస్తకంలో రాశారు. 20వ శతాబ్దం నాటికి మిగిలిన దక్షిణాది వంటకాలతో పాటుగా సాంబార్ కూడా శ్రీలంక ప్రజలకు సైతం పరిచయమైంది.

ప్రాంతాల వారీగా వెరైటీలు
కేవలం చింతపండు పులుసు, కూరగాయలు, కందిపప్పు ఈ మూడింటి కలయికతో ఇంత అద్భుతమైన వంటకం తయారవుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో. ప్రస్తుతం భోజనమైనా, టిఫిన్ అయినా సాంబార్ లేని రెస్టారెంట్ గాని, హోటల్ గానీ ఇండియాలో కనపడవు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రుచి సాంబార్ కు వస్తుంది. 'తులు 'ప్రాంతంలో కొబ్బరి వేసి సాంబార్ చేస్తారు. తమిళనాడు రాయలసీమ ప్రాంతాల్లో సాంబార్లో ఇంగువ తప్పనిసరి. తెలంగాణలోని కొన్ని చోట్ల ముల్లంగి, సొరకాయ వాడతారు.ఆంధ్ర ప్రాంతం లో ఆనపకాయ కానీ, దోస కాయ కానీ మస్ట్. ఇక జైన్స్, మార్వాడి లాంటి వాళ్ళలో ఉల్లిపాయ, వెల్లుల్లి తినని వాళ్లకోసం అవి లేకుండా కూడా సాంబార్ తయారు చేస్తారు.
సాంబార్ లో వాడే కూరగాయలను బట్టి దాని రుచి మారిపోతూ ఉంటుంది. ఏ కూరగాయ వేసిన సాంబార్ టేస్ట్ మాత్రం ఆహారప్రియుల్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది.