Telangana MLAs Chori: ఓట్ చోరి కంటే ఎమ్మెల్యేల చోరి పెద్ద నేరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల చోరిపై మాట్లాడకపోవడం రాహుల్ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని.. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తేనే ఓట్ చోరిపై మాట్లాడే నైతిక అర్హత ఉంటుందన్నారు. ఓట్ చోరీపై గొంతు చించుకుంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తెలంగాణలో తమ పార్టీ చేసిన ఎమ్మెల్యేల చోరీపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఒక నేరమైతే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలను దొంగిలించడం అంతకంటే పెద్ద నేరమని, అది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. రాహుల్ గాంధీకి సిగ్గు,శరం ఉంటే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. అప్పుడే ఆయనకు ఓట్ల చోరీ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పి, గల్లీలో అదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వెన్నతో పెట్టిన విద్య అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్న రాహుల్ గాంధీకి, తెలంగాణలో ఆయన పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల దొంగతనం కనిపించకపోవడం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలకు , రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.

బీఆర్ఎస్ సిద్ధాంతాలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసించి తెలంగాణ ప్రజలు గెలిపించిన పది మంది ఎమ్మెల్యేలను అధికార మదం, డబ్బును ఎరగా చూపించి కాంగ్రెస్ లో చేర్చుకోవడం అనైతికం, సిగ్గుమాలిన చర్య కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజా తీర్పును కాలరాసి కాంగ్రెస్ చేసిన సిగ్గుమాలిన చర్య ఓట్లను దొంగిలించడం కంటే ఘోరమైన నేరం అన్నారు. ఓట్ చోరీ గురించి మాట్లాడే ముందు, తెలంగాణలో కాంగ్రెస్ చేసిన ఎమ్మెల్యేల చోరీపై సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రజాతీర్పును అపహాస్యం చేసి సంతలో పశువుల్లా తెలంగాణ లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తీరుపై భారత్ జోడో న్యాయ్ యాత్ర చేసిన రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. ఫిరాయింపులతో తెలంగాణ ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారో చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎవరి బలం ఏంటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామన్నారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపు రాజకీయాలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని, సరైన సమయంలో ఆ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ హెచ్చరించారు.