IPL 2026 MS Dhoni VS Stephen Flemings: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సామర్థ్యంపై విశ్లేష‌కులు విరుచుకుప‌డుతున్నారు. 2009 నుండి కోచ్‌గా ఉన్న ఫ్లెమింగ్, ఇప్పటివరకు సాధించిన ఐదు ఐపీఎల్ టైటిళ్లు కేవలం ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వల్లే సాధ్యమయ్యాయని అభిప్రాయ‌పడుతున్నారు. ధోనీ నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో సీఎస్కే తన ఉనికిని కోల్పోతున్నట్లు కనిపిస్తోందని గుర్తు చేస్తున్నారు.

ధోనీ తోడు లేకపోతే అంతేనా?
ధోనీ కెప్టెన్సీ లేని చోట ఫ్లెమింగ్ ఎప్పుడూ విజయం సాధించలేదని చాలా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ విష‌యంలో భార‌త మాజీ ఓపెన‌ర్ శ‌ఠ‌గోప‌న్ ర‌మేశ్ .. ఫ్లెమింగ్ వ్యూహాల‌పై పెద‌వి విరిచాడు. ఫ్లెమింగ్ సక్సెస్ పూర్తిగా ధోనీపైనే ఆధారపడి ఉందని మారుతున్న ఆధునిక క్రికెట్ వేగానికి తగ్గట్లుగా ఫ్లెమింగ్ తన మైండ్‌సెట్‌ను మార్చుకోలేకపోతున్నాడ‌ని విమ‌ర్శించాడు. ప్రస్తుత అగ్రెసివ్ గేమ్‌లో ఆయన పాతకాలపు ఆలోచనలతో ఐదు అడుగులు వెనకబడి ఉన్నాడ‌ని, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను ఎలాగైతే విశ్లేషిస్తారో, కోచ్‌ల పనితీరును కూడా అలాగే పరీక్షించాల్సిన సమయం వచ్చిందని రమేష్ పేర్కొన్నాడు. రుతురాజ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జట్టు సరైన దిశలో సాగడం లేదని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

రుతురాజ్ ఫామ్ - కెప్టెన్సీ సవాళ్లు..
ఈ సీజన్‌లో కేవలం కోచ్ మాత్రమే కాదు, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రుతురాజ్ కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ర‌మేశ్ స్పందిస్తూ.. ఫోర్లు, సిక్సర్లు బాదడానికి అనుభవం అక్కర్లేదు కానీ, బౌండరీలను ఆపడానికి అనుభవం కావాలని విశ్లేషించాడు. ప్రస్తుతం సీఎస్కే బౌలింగ్ విభాగంలో ఆ అనుభవం లోపించిందని, రుతురాజ్ తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా బ్యాట్‌తో పరుగులు సాధించాలని సూచించాడు. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపిస్తేనే నాయకుడిగా ఆయనకు గుర్తింపు, ఆత్మవిశ్వాసం లభిస్తాయని రమేష్ పేర్కొన్నాడు.

ఢిల్లీతో కీలక పోరు..
సీజన్ ప్రారంభంలోనే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నైకి రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఈ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లోనైనా చెన్నై మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి. ఫ్లెమింగ్ తన వ్యూహాలను మార్చుకుని జట్టును గెలుపు బాట పట్టిస్తారా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఫ్యాన్స్ మాత్రం తమ ఫేవరెట్ టీమ్, ఐదుసార్లు చాంపియ‌న్ చెన్నై మళ్ళీ పాత వైభవాన్ని చాటుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఐపీఎల్ సన్నాహక శిభిరానికి ముందుగానే చేరుకున్న ధోనీ.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు గాయపడ్డాడు. అతను ప్రస్తుతం రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. త్వరలోనే చెన్నై జట్టులో చేరనున్నట్లు సమాచారం. అతను టీమ్ లోకి వస్తే జట్టు తలరాత మారుతుందని అభిమానులు ఆశగా చూస్తున్నారు. ఇక ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ లు ఓడిన చెన్నై పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.