బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై హింస పెరుగుతోంది. ఈ క్రమంలో గురువారం (జనవరి 8, 2026) నాడు సునామ్‌గంజ్ జిల్లాలో మరో హిందూ యువకుడిని హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని జాయ్ మహా పాత్రోగా గుర్తించారు. స్థానిక వ్యక్తి మొదట అతనిని దారుణంగా కొట్టాడని, ఆ తర్వాత విషం తాగాలని బలవంతం చేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు.

తీవ్ర గాయాలతో ఉన్న 19 ఏళ్ల జాయ్ మహా పాత్రోను సిల్హెట్ ఎంఏజీ ఉస్మాని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఐసీయూలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హిందువుల హత్యలు

బంగ్లాదేశ్‌లోని నర్సింది జిల్లాలో ఒక హిందూ వ్యక్తిని పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేసిన కొన్ని రోజుల అనంతరం ఈ ఘటన జరిగింది. జనవరి 6న మంగళవారం నాడు పలాష్ ఉపజిలాలోని చార్‌సింధూర్ బజార్ ప్రాంతంలో 40 ఏళ్ల మోనీ చక్రవర్తిపై దాడి చేశారు. ఆ దాడితో తీవ్రంగా గాయపడి అతను మరణించాడు.

మోనీ చక్రవర్తి హత్యకు కొన్ని గంటల ముందు, బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలో ఒక హిందూ వ్యాపారి, వార్తాపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. గత రెండు సంవత్సరాలుగా కోపాలియా బజార్‌లో ఐస్ ఫ్యాక్టరీ నడుపుతున్న కేశబ్‌పూర్ ఉపజిలాకు చెందిన పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు ప్రతాప్‌ను సోమవారం (జనవరి 5న) సాయంత్రం కొంతమంది వ్యక్తులు అతని ఫ్యాక్టరీ బయటకు రమ్మని పిలిచారు. ఆ తర్వాత ఒక వీధిలోకి తీసుకెళ్లి దారుణంగా కాల్చి చంపారు.

దీపు చంద్ర దాస్ హత్యతో హిందువులపై దాడులు, హత్యలు

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యల పరంపర గత నెల డిసెంబర్ 18, 2025న ప్రారంభం కాంవడం తెలసిందే. దేశంలోని మైమెన్‌సింగ్ జిల్లాలో, మతపరమైన ఆరోపణలపై హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను తీవ్రవాద ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి తగలబెట్టారు.

అంతేకాకుండా, బంగ్లాదేశ్‌లో 50 ఏళ్ల హిందూ వ్యాపారి ఖోఖన్ చంద్ర దాస్‌పై కూడా దారుణంగా దాడి చేసి సజీవ దహనం చేశారు. మూడు రోజుల తర్వాత అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీపుచంద్ర మతపరమైన ఆరోపణలు చేశాడని, తమ దేవుళ్లను కించపరిచాడని ఆరోపిస్తూ తీవ్రంగా దాడిచేసి చంపారు. మృతదేహాన్ని వేలాడదీసి నిప్పుపెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.