H1B Visa News:అమెరికన్ డ్రీమ్ సాకారం చేసుకోవాలనుకునే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు. H-1B వీసా ఫీజు పేరుతో భారీగానే వడ్డించారు. ఈ కొత్త విధానం కింద సెప్టెంబర్ 21 నుంచి విదేశీ కార్మికులను నియమించుకునే యజమానులు ప్రతి H-1B వీసా దరఖాస్తుకు 100,000 డాలర్లు అంటే సుమారు రూ. 83 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఐదు వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు

సాధారణంగా 2,000 నుంచి 5,000 డాలర్ల వరకు ఉండే మొత్తం ఫీజు, ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెరగడం చిన్న విషయం కాదు. ఈ నిర్ణయం రెక్లెస్‌ అని కొందరు విమర్శించగా, ఇది "చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లను నాశనం చేస్తుందని" మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధిక ఖర్చు కారణంగా "భారతీయులకు అమెరికన్ కల ముగిసిపోయింది" అని కూడా చాలా మంది అభిప్రాయపడ్డారు.

అమెరికా మేలు కోసమే అంటున్న ట్రంప్

H-1B వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు,"అమెరికన్ కార్మికుల వేతనాలను, ఉద్యోగ అవకాశాలను" పరిరక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్‌ సర్కారు పేర్కొంది. గతంలో ఈ వీసా పథకాన్ని, అమెరికన్ కార్మికులకు తక్కువ వేతనాలకు బదులుగా విదేశీ కార్మికులను నియమించుకోవడానికి ఉపయోగించారని ట్రంప్ ఆరోపించారు. భారతీయ ఐటీ కంపెనీలు ముఖ్యంగా ఈ విధానాన్ని తక్కువ వేతన కార్మికుల కోసం వాడుతున్నాయని ఆక్షేపించారు.

#WATCH | On the 'Gold Card' visa programme, US President Donald J Trump says, "... We think it's going to be very successful... It's going to raise billions of dollars, which will reduce taxes, pay off debt, and do other good things..."

(Source: The White House/YouTube) https://t.co/vEOosGZ4xk pic.twitter.com/GHJE800IVq

— ANI (@ANI) September 19, 2025

భారీగా పడిపోయిన ఇండియన్ కంపెనీల షేర్‌లు

ఈ ఫీజు పెంపు ప్రభావం భారతీయ ఐటీ రంగంపై అత్యంత తీవ్రంగా ఉండనుంది, ఎందుకంటే గత ఏడాది H-1B వీసా లబ్ధిదారులలో 71 శాతం నుంచి 72 శాతం వరకు భారతీయులే ఉన్నారు. ఈ వార్త వెలువడిన వెంటనే, అమెరికన్ డిపాజిటరీ రిసీట్‌లు (ADRs)లో లిస్ట్ అయిన ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీల షేర్లు 4% వరకు పడిపోయాయి.

అమెరికా ట్రెజరీకి కాసుల పంటే

ట్రంప్ ప్రభుత్వ వాదన ప్రకారం, ఈ కొత్త ఫీజు ద్వారా అమెరికా ట్రెజరీకి 100 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం వస్తుంది. ఈ డబ్బును పన్నులు తగ్గించడానికి, అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తామని కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. అయితే, దీని వల్ల భారతీయ ఐటీ కంపెనీలు తమ వ్యాపార నమూనాలను మార్చుకోవలసి వస్తుంది. లేదా ఉద్యోగులను విదేశాలకు (కెనడా లేదా యూరప్ వంటి దేశాలకు) పంపవలసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆందోళనలో ఉద్యోగులు, కంపెనీలు

ఈ ఫీజు ఏడాది మాత్రమే అమలులో ఉంటుందని ప్రొక్లమేషన్‌లో పేర్కొన్నప్పటికీ, లుట్నిక్ మాత్రం ఇది ఆరు సంవత్సరాల వీసా వ్యవధిలో ప్రతి సంవత్సరం 100,000 డాలర్లు అవుతుందని వ్యాఖ్యానించారు, ఇది కంపెనీలలో మరింత గందరగోళాన్ని సృష్టించింది. ఏదేమైనా, సెప్టెంబర్ 21 గడువు దగ్గర పడుతుండటంతో, కంపెనీలు, ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.