Revanth writes to PM Modi once again on delimitation issue: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. లోక్‌సభ స్థానాల పెంపు, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై ఆయన తన అభిప్రాయాలను మరియు వినూత్నమైన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను ఈ లేఖలో వివరించారు

మహిళా బిల్లుకు మద్దతు - డిలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దు

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే, మహిళా కోటాను ప్రస్తుతమున్న 543 స్థానాల్లోనే తక్షణమే అమలు చేయాలని, దీనిని లోక్‌సభ సీట్ల పెంపుతో ముడిపెట్టకూడదని ఆయన కోరారు . మహిళల రాజకీయ సాధికారత అనేది కేవలం ఒక చట్టపరమైన సంస్కరణ మాత్రమే కాదని, అది ఒక నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు .

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ప్రమాదం

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలనే ప్రతిపాదనపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయని హెచ్చరించారు. ఇది అభివృద్ధికి ఇచ్చే శిక్షగా మారుతుందని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆర్థిక వనరుల పంపిణీలో తెలంగాణ వంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కూడా తగ్గితే అది దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు .

రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్

ఈ సమస్యకు పరిష్కారంగా రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ మోడల్ ను ప్రతిపాదించారు . దీని ప్రకారం పెంచబోయే అదనపు సీట్లలో 50 శాతం సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలి . మిగిలిన 50 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల ఆర్థిక సహకారం , సామాజిక అభివృద్ధి ,ఇతర పనితీరు సూచికల ఆధారంగా కేటాయించాలి. ఈ నమూనా వల్ల ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందినందుకు నష్టపోదని, ప్రాతినిధ్యంలో సమతుల్యత ఉంటుందని ఆయన వివరించారు .

Dear Shri @narendramodi Ji

I am writing this open letter to you in response to the latest proposal to increase Lok Sabha seats to 850.#LokSabhaDelimitation pic.twitter.com/4M566g78kU

— Revanth Reddy (@revanth_anumula) April 14, 2026

అఖిలపక్ష సమావేశానికి డిమాండ్

దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి కీలక అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానిని కోరారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలతో సుదీర్ఘంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన, పారదర్శకమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశ బలమని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలను గౌరవించినప్పుడే దేశం బలోపేతం అవుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.