Bengal Muslim vote bank: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో ముస్లిం ఓటు బ్యాంకు అత్యంత కీలకమైన నిర్ణయాత్మక శక్తిగా అవతరించింది. రాష్ట్ర జనాభాలో సుమారు 30 శాతానికి పైగా ఉన్న మైనారిటీ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే అంశంపైనే రైటర్స్ బిల్డింగ్ పీఠం ఆధారపడి ఉంది. రాష్ట్రంలోని మొత్తం 294 నియోజకవర్గాల్లో సుమారు 100 నుండి 120 స్థానాల్లో ముస్లిం ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను శాసించగలరు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో వీరి జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఈ వర్గం ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

చీలిక దిశగా అడుగులు.. మమతకు దడ!

గత ఎన్నికల వరకు ముస్లిం ఓటర్లు గంపగుత్తగా మమతా బెనర్జీ (TMC) వెంటే నిలిచారు. అయితే, ఈసారి మైనారిటీ ఓట్లు చీలిపోయే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటం దీదీకి నిద్రలేకుండా చేస్తోంది. ఒకవైపు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (AIMIM) , మరోవైపు బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హుమాయున్ కబీర్ నేతృత్వంలోని AJUP పార్టీలు మైనారిటీ ఓట్లను చీల్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఓట్లలో 5 నుండి 10 శాతం చీలిక వచ్చినా, అది పరోక్షంగా బీజేపీ విజయానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.

హుమాయున్ కబీర్ వీడియో సెన్సేషన్

ఈ రాజకీయ చదరంగంలో హుమాయున్ కబీర్ పాత్ర ఇప్పుడు సంచలనంగా మారింది. మైనారిటీ ఓట్లను చీల్చేందుకు బీజేపీతో రూ. 1000 కోట్ల భారీ ఒప్పందం చేసుకున్నారంటూ టీఎంసీ విడుదల చేసిన వీడియో రాష్ట్రంలో అగ్గి రాజేసింది. ముస్లింలను మోసం చేయడం సులభం అని కబీర్ అన్నట్లుగా ఉన్న వ్యాఖ్యలు మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని, టీఎంసీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు పక్కా స్కెచ్‌తో హుమాయున్ కబీర్‌ను రంగంలోకి దించారని టీఎంసీ ఆరోపిస్తోంది.

బీజేపీని బూచి గా చూపిస్తున్న దీదీ

దీనిని తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ బీజేపీని బూచిగా చూపించే వ్యూహాన్ని మరింత పదును పెట్టారు. మీ ఓట్లు చీలితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు ఎన్ఆర్సీ , సీఏఏ రూపంలో మీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అంటూ ఆమె ముస్లిం ఓటర్లను పదేపదే హెచ్చరిస్తున్నారు. మైనారిటీల రక్షణకు తనొక్కరే కవచంలా ఉన్నానని, ఎంఐఎం లేదా హుమాయున్ కబీర్ వంటి వారు కేవలం బీజేపీకి మేలు చేసే బీ-టీమ్ లేనని ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఒకే వైపు ఉంటారా?

ముస్లిం ఓటర్లలో ప్రస్తుతం గందరగోళం నెలకొంది. యువతలో ఒక వర్గం అభివృద్ధి , ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూస్తుండగా, పెద్దలు మాత్రం భద్రత దృష్ట్యా మమత వైపే మొగ్గు చూపుతున్నారు. హుమాయున్ కబీర్ వీడియో వివాదం తర్వాత, మైనారిటీ ఓటర్లు మరింత అప్రమత్తమయ్యారు. అయినప్పటికీ, ముక్కోణపు పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల చీలిక కూడా ఫలితాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది. బెంగాల్ సుల్తాన్ ఎవరో తేల్చే ఈ మైనారిటీ ఓటు బ్యాంకు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. మమతా బెనర్జీ తన పట్టును నిలుపుకుంటారా లేక ఓట్ల చీలికతో బీజేపీ విజయానికి మార్గం సుగమం అవుతుందా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైనారిటీ ఓటు చీలితే మమత పతనం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల అంతిమ అంచనా.