హైదరాబాద్: తెలంగాణలో 1400 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించడంతోపాటు ఆసుపత్రిలో సేవల ధరలు 20శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ (Aarogyasri) నెట్ వర్క్ ఆసుపత్రులు సేవలు నిలివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు రోగులను అయోమయంలో పడేస్తున్నాయి.ప్రవేటు ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రులలో సేవలు కొనసాగిస్తూ, వేరేవాటిలో మాత్రం సేవలు నిలివేవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం స్పందిస్తూ కేవలం 13శాతం ఆసుపత్రులలో మాత్రమే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయని, మిగతా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వైద్యం అందుతోందని అంటోంది. ఇలా విభిన్న ప్రకటనల ద్వారా ఆరోగ్యశ్రీ సేవల విషయంలో సందిగ్ధం నెలకొంది.

ఆరోగ్యశ్రీపై నిర్లక్ష్యం కొత్తేకాదు..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2008లో ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చింది. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిచాలనే లక్ష్యంతో మొదలైన ఈ పథకం తరువాతి కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది, నేటికీ ఎదుర్కొంటూనే ఉంది. వైఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ పథకం ఆయన మరణం తరువాత రోశయ్య హాయంలో కొంతకాలం ఆటంకాలు లేకుండా కొనసాగింది. ప్రవేటు ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం కోసం అప్పట్లో ఈ పథకం కొోసం ప్రత్యేకంగా గ్రీన్ చానెల ఏర్పాటు చేసి మరీ 45 రోజుల్లోపే ప్రవేటు ఆసుపత్రులకు బాకాయిలు విడుదల చేసేవారు. అప్పట్లో ఐఎఎస్ అధికారి బాబు ప్రత్యేక చొరవతో ఆసుపత్రులకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు.

2014 తరువాత పరిస్దితులు పూర్తిగా మారిపోయాయి. పెరుగుతున్న వేతనాలు, ఆసుపత్రి నిర్వహణ వ్యయం దృష్టిలో పెట్టుకుని ప్రతీ రెండేళ్లకోసారి రివ్యూచేసి , 20శాతం వైద్య సేవల ఖర్చు పెంచాలని ప్రవేటు ఆసుపత్రులు చేసిన వినతిని పరిగణలోకి తీసుకున్న అప్పటి ప్రభుత్వం , ఖచ్చితంగా పెంచుతామని హామీ ఇచ్చింది. అది మొదలు నేటి వరకూ ఒక్కసారి కూడా వైద్యసేవల ఖర్చు పెంపుపై కనీసం రివ్వూ చేసిన దాఖలాలు లేవు. 20శాతం కాదుకదా, పైసా కూడా పెంచిన పరిస్దితి లేదు.

ఒక్క సమీక్ష నిర్వహించని కేసీఆర్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఆరోగ్యశ్రీపై కనీసం ఒక్కటంటే ఒక్క సమీక్ష నిర్వహించలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. ఏళ్లతరబడి పేరుకుపోయిన నెట్ వర్క్ ఆసుపత్రుల సమస్యలు కనీసం పరిష్కారం దిశగా ఒక్క అడుగు పడలేదంటున్నారు. హరీష్ రావు మంత్రిగా ఉన్న సమయంలో కొంత వరకూ నిధులు విడుదల చేశారు. గత రెండేళ్లుగా పాత బకాయిలు పూర్తిగా చెల్లించడం మానేశారు. ఇలా కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లుగా వైఎస్ హాయం తరువాత నెమ్మదిగా ఆరోగ్యశ్రీ తీవ్ర నిర్లక్ష్యానికి గురైయ్యిందనేది వాస్తవం.

ఒకప్పుడు 20శాతం ఉచితంతో మొదలైన ఆరోగ్యశ్రీ తరువాత కాలంలో బిపిఎల్ లబ్దిదారులకు 80శాతం ఉచితం వైద్యం అందిస్తున్నాం. ఇలా దాదాపు పూర్తి స్దాయిలో క్రెడిట్ పై వైద్యసేవలు అందించడం, 1400 కోొట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పేరుకుపోవడంతో దిక్కుతోచని స్దితిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలివేస్తున్నామని చెబుతున్నాయి నెట్ వర్క్ ఆసుపత్రులు.

స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ప్రభుత్వం..

గత రెండు రోజులుగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై నెట్ వర్క్ ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వైద్యఆరోగ్య శాఖ మంత్రి దమోదర రాజనర్సింహా స్పందిస్తూ, గత ప్రభుత్వం నెలకు 50 కోట్ల రూపాయాలు మాత్రమే నిధులు విడుదల చేసింది, మేము 100 కోట్లు ఇస్తున్నాం. దయచేసి అర్ధం చేసుకోండి. మీకు ఇచ్చిన అవకాశం మిస్ యూజ్ చేసుకోవద్దంటూ చెప్పారు.