హైదరాబాద్: ఏడాదికి రూ. 10,000 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి ఉన్నప్పటికీ ఆహార పరిశుభ్రత రేటింగ్స్ (ఫుడ్ హైజీన్ రేటింగ్స్) అమలు చేయడంలో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రో నగరాలన్నింటికంటే మన భాగ్యనగరం అట్టడుగు స్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లో కేవలం 361 ఈటరీలు మాత్రమే ఇప్పటివరకు అధికారిక హైజీన్ రేటింగ్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నాయి.

కేవలం 2 శాతం లోపు హోటల్స్, రెస్టారెంట్లకే గుర్తింపు
హైదరాబాద్‌ వ్యాప్తంగా మొత్తం దాదాపు 75,000 ఆహార విక్రయ కేంద్రాలు (Food Centers) నడుస్తుండగా.. అందులో కేవలం 25,000 హోటల్స్, రెస్టారెంట్లకు మాత్రమే లైసెన్స్ ఉంది. ఈ లైసెన్స్ ఉన్న హోటళ్లలో కూడా కేవలం 361 సంస్థలు మాత్రమే హైజీన్ రేటింగ్స్ సాధించాయి. మొత్తం లైసెన్స్ ఉన్న హోటళ్లలో ఇది 2 శాతం కంటే తక్కువే. హైదరాబాద్ అంటే బిర్యానీ గుర్తుకొస్తుందని, ఐ లవ్ బిర్యానీ అంటూ తినేవాళ్లు ఈ విషయాలు గమనిస్తే మాత్రం కంగుతింటారు.

దేశ రాజధాని ఢిల్లీ 3,394 హైజీన్ సర్టిఫైడ్ హోటళ్లతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా.. కర్ణాటక రాజధాని బెంగళూరులో 2,200 హోటళ్లు ఈ రేటింగ్‌ కలిగి ఉన్నాయి. చివరికి అహ్మదాబాద్, జైపూర్ వంటి చిన్న నగరాలు సైతం హైదరాబాద్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లను జల్లెడ పడుతున్నారు. అక్కడి ఆహార నాణ్యతతో పాటు తయారుచేసే చోట పరిశుభ్రతను పరిశీలించి షాకవుతున్నారు. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లకు దారుణమైన హైజీన్ రేటింగ్స్‌ ఇస్తున్నారు.

Also Read : అవిసె గింజలు, బియ్యం, కలబందతో హెయిర్ మాస్క్.. నేచురల్ కెరాటిన్ ట్రీట్‌మెంట్ కోసం ట్రై చేయండి

ఫుడ్ సెంటర్ యాజమాన్యాల నిరాసక్తత
హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు ఈ హైజీన్ రేటింగ్స్ పట్ల ఆసక్తి లేకపోవడం వల్లే హైదరాబాద్ చివరి స్థానంలో నిలవడానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) రేటింగ్ విధానం ద్వారా ఆహారాన్ని తయారు చేసే పద్ధతులు, పరిశుభ్రత, నిల్వ ఉంచే వాతావరణం సహా పలు అంశాలను పరిశీలించి 1 నుండి 5 స్టార్ల వరకు రేటింగ్స్ ఇస్తారు. అయితే, ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేయకపోవడంతో హైదరాబాద్‌లో హోటల్, రెస్టారెంట్స్ నిర్వాహకులు దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ (GHMC) ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల సమయంలో అవగాహన కల్పిస్తున్నా అంతగా రెస్పాన్స్ రావడం లేదు.

పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదన
నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) గతంలో ఆహార భద్రతా నిబంధనలపై అవగాహన పెంచుతామని ప్రకటించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్‌లో ఏరియా వారీగా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సిఫార్సు చేసినట్లు ఎన్‌ఆర్‌ఏఐ ప్రతినిధి టి. సంపత్ తెలిపారు. ఎన్‌ఆర్‌ఏఐ ప్రతినిధులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, సామాన్య ప్రజలతో కూడిన ఈ కమిటీలు.. రేటింగ్స్ లేని ఫుడ్ ఔట్‌లెట్స్ సందర్శించి పరిశుభ్రత లోపాలను గుర్తిస్తాయని తెలిపారు. కలుషిత, నాసి రకం ఫుడ్ ఐటమ్స్ తినకుండా వినియోగదారులను కాపాడేందుకు ప్రభుత్వం హైజీన్ ఫుడ్ రేటింగ్స్ తప్పనిసరి చేయాల్సి ఉంటుందన్నారు.