Sanju Samson Ind vs Wi T20 World Cup | కోల్‌కతా: మార్చి 1న రాత్రి భారత క్రికెట్‌ జట్టుకు కేవలం ఒక విజయం మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ కమ్‌బ్యాక్ స్టోరీగా నిలిచిపోయింది. వెస్టిండీస్‌పై టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ నాటౌట్‌గా 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు సెమీఫైనల్ టికెట్‌ను అందించాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత చర్చ కేవలం అతని గేమ్ గురించి మాత్రమే కాదు, కెమెరాలో బంధించిన ఆ అపురూప క్షణాల గురించి కూడా జరుగుతోంది.

సంజూ శాంసన్ సెలబ్రేషన్

మ్యాచ్‌లో చివరి విన్నింగ్ షాట్ బాదగానే మిగిలిన ఆటగాళ్లందరూ ఎంతో ఉత్సాహంతో సంబరాలు చేసుకుంటుండగా, సంజూ శాంసన్ శైలి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. శాంసన్ ముందుగా తన బ్యాట్‌ను ముద్దాడి, ఆపై ఆకాశం వైపు చూస్తూ కళ్లు మూసుకున్నాడు. ఈ క్షణం అతని సుదీర్ఘ నిరీక్షణకు, కష్టానికి, విమర్శలకు సమాధానంలా అనిపించింది. గత కొన్నేళ్లుగా సంజూ జట్టులో చోటు సంపాదించుకోవడానికి ఎంతో పోరాడాల్సి వచ్చింది. చాలాసార్లు జట్టుకు దూరమయ్యాడు. అందుకే గెలిచాక హెల్మెట్ తీసి పక్కకు పడేసి, ప్రే చేసిన వీడియో వైరల్ అవుతోంది.

గంభీర్ కౌగిలింత ప్రత్యేక క్షణంగా నిలిచింది

మైదానం నుంచి బయటకు వస్తున్న సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బౌండరీ లైన్ వద్ద అతని కోసం వేచి ఉన్నారు. సంజూ శాంసన్ అతని దగ్గరకు రాగానే, గంభీర్ అతడిని హత్తుకుని వెన్ను తట్టారు. అతని ప్రదర్శనపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఎంతటి నమ్మకం ఉందో ఈ సీన్ చాటిచెప్పింది.

భార్య వీడియో కాల్

మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు డగౌట్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో శాంసన్ అందరికీ దూరంగా వచ్చి తన భార్య చారులతతో వీడియో కాల్‌లో మాట్లాడాడు. అప్పుడు అతని కళ్లలో సంతోషం కనిపిస్తోంది. కష్టకాలంలో కుటుంబం తోడ్పాటు ఎంత ముఖ్యమో ఈ క్షణం ప్రతి ఒక్కరికీ ఒక ఉదాహరణగా నిలిచింది. వరుణ్ చక్రవర్తి విషయంలోనూ ఇటీవల ఇదే జరిగింది.

కెప్టెన్ కూడా ప్రశంసలు

మ్యాచ్ తర్వాత సంజూ శాంసన్ ఇన్నింగ్స్ పట్ల కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. క్రీజు వీడి నుంచి డగౌట్ వైపు వస్తున్న సమయంలో కెప్టెన్ అతడిని అభినందిస్తూ తన క్యాప్‌ను తీసి, తల వంచి గౌరవ పూర్వక స్వాగతం పలికాడు. ఒత్తిడిలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం జట్టుకు చాలా ముఖ్యమని సూర్య అన్నాడు.

ప్రేక్షకుల నీరాజనం

సంజూ శాంసన్ ఆడిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లోని వేలాది మంది ప్రేక్షకులు లేచి నిలబడి స్టాండింగ్ ఒవెషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొన్న అదే బ్యాటర్ ఈరోజు టీమ్ ఇండియాకు ఒక గొప్ప మ్యాచ్ విన్నర్‌గా మారి జట్టును సెమీఫైనల్‌కు తీసుకెళ్లాడు.

ఇప్పుడు సెమీఫైనల్‌పై ఫోకస్

ఇండియా జట్టు మార్చి 5న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుతో జరగనున్న సెమీఫైనల్ పోరుపై ఫోకస్ చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకోవడానికి కూడా ఉపయోగపడింది.