AP Local Body Elections | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నాడు జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును పెంచామన్నారు. ఎన్నికల నామినేషన్ల ఘట్టం సమయంలో హింసాత్మక ఘటనలు నమోదు నమోదైన ప్రాంతాలకు అదనపు పోలీసు బలగాలను తరలించినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ఎలాంటి భయందోళనలు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా పక్కా భద్రతా చర్యలు చేపట్టామని అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు, ఏకగ్రీవాల ప్రక్రియ ముగిసిన అనంతరం మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకే (AP Urban Local Bodies) పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో 13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. 8 పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్‌ సహా వార్డు సభ్యుల స్థానాలు పూర్తిగా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

ఈ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ నగరపాలక సంస్థల్లో 118 మంది కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో 756 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవాల అనంతరం ప్రస్తుతం 6,669 మంది అభ్యర్థులు ఎన్నికల నిలిచారు. మొత్తం 2,382 స్థానాలకు సంబంధించి 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 13,504 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు. శనివారం ఉదయం నుంచే పోలింగ్ సామగ్రిని కార్పొరేషన్, మున్సిపల్ ఆఫీసుల నుంచి కేంద్రాలకు విజయవంతంగా తరలిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 నగరపాలక సంస్థల్లో మేయర్ స్థానాల కోసం 153 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ కార్పొరేషన్లలో మొత్తం 922 డివిజన్ స్థానాలు ఉండగా, అందులో 118 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. దాంతో మిగిలిన 804 డివిజన్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 3,073 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ కోసం 6,384 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 59,97,918 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వివరాలు
రాష్ట్రంలోని 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో 17 ఛైర్‌పర్సన్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 70 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల కోసం 367 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 3,020 వార్డు స్థానాలకు గాను 637 వార్డులు ఏకగ్రీవమవడంతో, మిగిలిన 2,382 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్‌లో మొత్తం 6,669 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి కోసం 5,321 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 39,38,096 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.