భారత్‌లో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. సుదూర ప్రయాణాలకు తక్కువ ఖర్చులో, సౌకర్యవంతమైన ప్రయాణాల కోసం రైళ్లను ఎంచుకుంటారు. కొన్నిసార్లు వాతావరణం అనుకూలించకపోవడం, సాంకేతిక సమస్యలతో రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఇబ్బంది పడటమే కాకుండా, వారి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కొన్నిసార్లు పనులు పూర్తిగా రద్దు చేసుకోవాల్సి వస్తుంది.

అయితే భారత రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం ఒక ప్రత్యేక రూల్ తీసుకొచ్చింది. మీ రైలు బాగా ఆలస్యమై, మీరు ప్రయాణం చేయకూడదని భావిస్తే, మీ టికెట్ ఛార్జీలను పూర్తిగా వెనక్కి పొందవచ్చు. మరి రైలు లేట్ అయితే పూర్తి డబ్బు వస్తుందా? IRCTC ద్వారా ఎలా క్లెయిమ్ చేయాలో ఇక్కడ వివరాలు తెలుసుకోండి.

పూర్తి రీఫండ్ ఎప్పుడు లభిస్తుంది?
ఒకవేళ రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే, మీ దగ్గర కన్ఫర్మ్ (Confirm), RAC లేదా వెయిటింగ్ టికెట్ ఉన్నా.. రైలు ఆలస్యం కారణంగా మీరు ప్రయాణం చేయకపోతే, అటువంటి పరిస్థితిలో మీరు పూర్తి రీఫండ్ పొందేందుకు అర్హులు. ఒకవేళ మీ రైలు 4 గంటలు ఆలస్యంగా ఉండి, మీరు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైల్వే నిబంధనల ప్రకారం, మీకు పూర్తి డబ్బు తిరిగి వస్తుంది. కానీ, దీని కోసం సరైన సమయంలో సరైన ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి.

ఈ-టికెట్ (E-Ticket) ఉన్నవారు ఏం చేయాలి?
మీరు ఆన్‌లైన్‌లో (IRCTC వెబ్‌సైట్ లేదా IRCTC యాప్ ద్వారా) టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, రైలు బయలుదేరాల్సిన నిర్ణీత సమయానికి ముందే మీరు ఆన్‌లైన్‌లో TDR (Ticket Deposit Receipt) ఫైల్ చేయాల్సి ఉంటుంది. రీఫండ్ ప్రాసెస్ అవ్వాలంటే TDR ఫైల్ చేయాలి. రీఫండ్ మనీ సాధారణంగా 3 నుండి 7 వర్కింగ్ డేస్ లో మీరు టికెట్ బుక్ చేసిన బ్యాంక్ ఖాతాలోకే జమ అవుతుంది. ఒకవేళ రైలు వెళ్ళిపోయిన తర్వాత మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ లభించదు.

కౌంటర్‌లో టికెట్ తీసుకున్న వారు ఏం చేయాలి
మీరు రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుండి టికెట్ కొనుగోలు చేస్తే.. రైలు బాగా లేట్ అయినప్పుడు ఆ టికెట్‌ను కౌంటర్ వద్దకు వెళ్లి క్యాన్సిల్ చేయించుకోవాలి. టికెట్ క్యాన్సిల్ చేయకుండా రీఫండ్ రాదు, కనుక సరైన సమయంలో రియాక్ట్ అవ్వాలి.

రీఫండ్ ఎక్కడ, ఎలా అడగాలి?
ఆన్‌లైన్ టికెట్ల కోసం IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో, ఆఫ్‌లైన్ టికెట్ల కోసం సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద రీఫండ్ కోరవచ్చు. ఒకవేళ మీరు సాధారణ పరిస్థితుల్లో టికెట్ క్యాన్సిల్ చేస్తే (అంటే రైలు లేట్ కానప్పుడు), కొంత క్యాన్సిలేషన్ ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఛార్జీ టికెట్ రకం, మీరు క్యాన్సిల్ చేసే టైంపై ఆధారపడి ఉంటుంది.