Yamaha Fascino 125 Fi Price And Features Telugu: యమహా ఫాసినో 125 ఫై స్కూటర్‌లో కొత్త ఫీచర్లు వచ్చి చేరాయి. ముఖ్యంగా TFT డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. కొత్త రంగులను కూడా యమహా పరిచయం చేసింది. ప్రస్తుతం ఫాసినో 125 మూడు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరల్లో దాదాపు రూ.21 వేల వరకు వ్యత్యాసం ఉంది. అయితే మూడు వేరియంట్లలోనూ కొన్ని ప్రధాన ఫీచర్లు ఒకేలా ఉంటాయి.

ముందుగా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే.. మూడు వేరియంట్లలోనూ 125cc, సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.2hp పవర్ & 10.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను కూడా ఇందులో అందించింది. అవసరమైన సమయంలో ఇది అదనపు టార్క్ అందిస్తుంది. స్టార్టర్ మోటార్ జనరేటర్ & స్టాప్-స్టార్ట్ వ్యవస్థ కూడా అన్ని వేరియంట్లలోనూ ఉంటాయి.

మూడు వేరియంట్లలోనూ యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. వెనుక డ్రమ్ బ్రేక్‌ను అందించారు. టైర్లు, రిమ్ సైజులు కూడా ఒకేలా ఉంటాయి. సీటు కింద 21 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సీటు ఎత్తు & స్కూటర్ బరువులో కూడా వేరియంట్ల మధ్య ఎలాంటి మార్పు లేదు.

డ్రమ్ వేరియంట్ (Drum Variant)

ఇది ఫాసినో 125లో బేస్ వేరియంట్. ఇందులో ముందు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా LCD డిస్‌ప్లేను అందించారు. కనెక్టివిటీ ఫీచర్లు ఉండవు. ఎల్లో కాక్‌టెయిల్ & మెటాలిక్ బ్లాక్ అనే రెండు రంగుల్లో ఈ వేరియంట్ లభిస్తుంది. దీని ధర రూ.78,980. తక్కువ బడ్జెట్‌లో ఫాసినో కొనాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక.

ఇది కూడా చదవండి: యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!

డిస్క్ వేరియంట్ (Disk Variant)

ఇది మధ్యస్థాయి వేరియంట్‌. ఇందులో ముందు డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీంతోపాటు యమహా Y-Connect కనెక్టివిటీ ఫీచర్ కూడా వస్తుంది. ఫోన్ నోటిఫికేషన్లు, బ్యాటరీ స్థాయి, ఇంధన వినియోగ వివరాలు, సర్వీస్ సూచనలు & చివరిగా స్కూటర్‌ను పార్క్ చేసిన ప్రదేశం వంటి సమాచారాన్ని యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ వేరియంట్‌లో కూల్ బ్లూ మెటాలిక్, డార్క్ మ్యాట్ బ్లూ, మ్యాట్ బ్లాక్ & మెటాలిక్ లైట్ గ్రీన్ రంగులు ఉన్నాయి. దీని ధర రూ.91,070. బేస్ వేరియంట్ కంటే ఇది రూ.12,090 ఎక్కువ.

స్పెషల్ వేరియంట్ (Special Variant)

ఇదే ఫాసినో 125లో ప్రస్తుతం టాప్ వేరియంట్. ఇందులో LCD డిస్‌ప్లే స్థానంలో TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. దీంతో, Y-Connectలో ఉన్న ఫీచర్లకు అదనంగా టర్న్-బై-టర్న్ నావిగేషన్ & మ్యూజిక్ అలర్ట్స్ కూడా లభిస్తాయి.

యమహా స్కూటర్ ఆన్సర్ బ్యాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంటుంది. పార్కింగ్‌లో ఉన్న స్కూటర్‌ను యాప్ సహాయంతో సులభంగా గుర్తించవచ్చు. ఈ వేరియంట్ మ్యాట్ బ్లాక్ & మెటాలిక్ ఆరెంజిష్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.99,030.

ఇది కూడా చదవండి: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?

ఏ వేరియంట్ కొనాలి?

ధరను ప్రధానంగా చూసేవారికి డ్రమ్ వేరియంట్ సరిపోతుంది. డిస్క్ బ్రేక్ & కనెక్టివిటీ ఫీచర్లు కావాలంటే డిస్క్ వేరియంట్ మంచి ఎంపిక. TFT డిస్‌ప్లే, నావిగేషన్, మ్యూజిక్ అలర్ట్స్ వంటి అదనపు ఫీచర్లు కావాలనుకుంటే స్పెషల్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.