Divine Flowers: చాలామంది దేవుడి దగ్గర పూజలో భాగంగా వినియోగించిన పూలు ఆ తర్వాత తీసేసి బయటపడేస్తారు. కొందరేమో అలా పడేయకూడదు అంటారు. మరి ఏం చేయాలి? వాటిని తిరిగి వినియోగించవచ్చా?

దేవుడి పూజలో భాగంగా దీపం, ధూపం, నైవేద్యంతో పాటూ పూలు, అక్షతలు తప్పనిసరిగా వినియోగిస్తారు. అయితే దేవుడి దగ్గర పూజలో భాగంగా వినియోగించిన పూలను ఏం చేయాలనే ఆలోచన చాలామందికి వస్తుంటుంది?

భగవంతుడి పూజలో వినియోగించిన పూలను..చాలామంది చెట్ల దగ్గర వేస్తుంటారు

మరికొందరు చేసేది లేక చెత్తతో పాటూ పడేస్తుంటారు

ఇంకొందరు సెపరేట్ కవర్లో ఉంచి తీసుకెళ్లి నీటిలో విడిచిపెడతారు

అయితే ఇకపై ఆ పూలను ఏం చేయాలి అనే సందేహం వద్దంటూ అద్భుతమైన సలహా ఇస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు.

భగవంతుడి పూజలో వినియోగించిన పూలను ఎండబెట్టి పొడిచేసి వాటితో అగరుబత్తి, ధూపం స్టిక్స్ తయారు చేయొచ్చు. చాలా మంది ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది పర్యావరణానికి మంచిది.. పూలు వృథాకాకుండా వినియోగించుకున్నట్టు అవుతుంది. మరోవైపు ఆధ్యాత్మికంగానూ ఇది చాలా మంచిది. ఎందుకంటే దేవుడికి సమర్పించినవి వృధాగా పడేయకుండా మళ్లీ వినియోగించడం పవిత్రమైన పనిగా భావిస్తారు.

భారత్ లో Phool, Help Us Green, Aaruhi enterpries వంటి కొన్ని స్టార్టప్ లు ఆలయాల నుంచి వాడిన పూలను సేకరించి వాటిని ఎండబెట్టి, పొడిచేసి దూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు. ఇంట్లోనూ ఇదే పద్ధతి అనుసరించవచ్చు.

పూలతో పూజ పూర్తిచేసిన తర్వాత..అవి వాడిపోయిన తర్వాత వాటిని ఎండలో పెట్టండి. గులాబీ, చామంతి, జాజి, కమలం ఏ పూలు అయినా పర్వాలేదు.

ఎర్రటి ఎండలో వద్దు..పూల రంగు మారిపోతుంది.

పూలలో చెమ్మ లేకుండా ఎండిన తర్వాత వాటిని మిక్సీ పట్టండి.

సువాసన కోసం ఆ పొడిలోనే కొంత చందనం కలపండి

గుగ్గిలం, కర్పూరం కూడా మిక్స్ చేయొచ్చు

కొంత నెయ్యి మిక్స్ చేయండి

అదనపు సుగంధం కోసం రోజ్ వాటర్ కూడా మిక్స్ చేయండి

అన్నీ కలిపి పేస్ట్ లా తయారు చేయండి..ఇంకా పొడి పొడిగా అనిపిస్తే నీరు కలపొచ్చు

ఆ పేస్ట్ తో స్టిక్స్ లేదా కోన్స్ తయారు చేయండి.. బంబూ స్టిక్స్ మీద రాసి చేతితో కోన్ ఆకారంలో తయారు చేసి మళ్లీ 3 రోజులు ఎండబెట్టండి

పూర్తిగా ఎండిన తర్వాత వాటిని వెలిగించొచ్చు

కుళ్లిన పూలు, పురుగులు పట్టిన పూలు కాకుండా మంచి పూలు తీసుకోండి

సుగంధం పూల వాసన బట్టి మారుతుంది..

అయితే దేవుడికి వాడిన పూలు మళ్లీ స్టిక్స్ తయారు చేసి వినియోగించవ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది. కానీ వాటిని ఎక్కడో పడేసేకన్నా ఇది మంచిదే కదా అంటున్నారు కొందరు పండితులు. మీకు ఆ సెంటిమెంట్ ఉన్నప్పుడు ఆ ధూప్ స్టిక్స్ ని దేవుడి దగ్గర కాకుండా ఇంట్లో వెలిగించండి.. నిత్యం ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. పైగా ప్రకృతికి మేలు చేసిన వారు అవుతారు.

పూజకు వినియోగించినవి మళ్లీ వినియోగించకూడదు అని నమ్మేవారు ఉన్నారు..ఇది పూర్తిగా మీ వ్యక్తిగత అభిప్రాయం

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.