భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరిగింది. ప్రభుత్వాలు సైతం ఈ దిశగా రాయితీలు అందించడంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తాయని ప్రజల్ని ప్రోత్సహిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో తక్కువ ఖర్చుతో, నెలవారీ బడ్జెట్ దెబ్బతినకుండా ఈవీల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇంటి వద్దే ఛార్జింగ్ చేసుకుంటూ, రోజువారీ వినియోగానికి సైతం మెరుగ్గా ఉండే ఎలక్ట్రిక్ కార్ల కోసం చూస్తున్నారు.

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) తన సరికొత్త, చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ VF 3ని భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీగా ఉంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలవనుంది. ఎందుకంటే దీని ధర రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది.

విన్‌ఫాస్ట్ VF 3ని ప్రత్యేకంగా సిటీ రోడ్లపై నడపడానికి వీలుగా డిజైన్ చేశారు. దీని పరిమాణం కాంపాక్ట్‌గా ఉండటం వల్ల రద్దీగా ఉండే రోడ్లపై, ఇరుకైన పార్కింగ్ స్థలాలలో సైతం ఈ కారును సులభంగా నడపవచ్చు. యువత, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని విన్‌ఫాస్ట్ కంపెనీ దీనిని రూపొందించింది.

ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ ఎంత
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ VinFast VF3 సింగిల్ ఛార్జ్‌పై సుమారు 215 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. పెద్ద బ్యాటరీ ఆప్షన్ ఉంటే కనుక మరింత రేంజ్ వచ్చే అవకాశం ఉంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు లేదా సిటీలో డైలీ బిజినెస్ పనుల మీద తిరగడానికి ఈ రేంజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ కారులో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనివల్ల బ్యాటరీ తక్కువ సమయంలోనే ఛార్జ్ అయి, మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ తమ కారును ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

వీఎఫ్3 ఎస్‌యూవీ డిజైన్
VF 3 డిజైన్ విషయానికి వస్తే లుక్ బాక్సీగా, పక్కా ఎస్‌యూవీలా ఉంటుంది. సైజ్ కాస్త చిన్నదైనప్పటికీ, ఇది ఎంతో దృఢంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని ఫ్రంట్, రియర్ భాగాల్లో మోడ్రన్ స్టైలింగ్ ఇవ్వడం వల్ల ఇది యంగ్ జనరేషన్‌ను బాగా ఆకట్టుకోగలదు.

భారత మార్కెట్లో ఈ కారు బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడనుంది. కంపెనీ దీని ధరను రూ. 10 లక్షల కంటే తక్కువలో ఉంచితే, ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఈ ధర పరిధిలో మార్కెట్లో చాలా తక్కువ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. కనుక VF 3కి మార్కెట్లో మంచి రెస్పాన్స్ లభిస్తుందని, ఒకవేళ విన్‌ఫాస్ట్ తన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తక్కువ ధరకే లాంచ్ చేస్తే, గేమ్ ఛేంజర్‌గా మార్కెట్లో ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు.

టాటా టియాగో ఈవీ (Tata Tiago EV)
భారత్‌లో ప్రస్తుతానికి అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ఈవీ మొదట ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ. 8 లక్షలు ఉంటుంది. విన్‌ఫాస్ట్ VF 3 నేరుగా టాటా టియాగో ఈవీ మార్కెట్‌ను దెబ్బతీసే ఛాన్స్ ఉంది.

ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV)
సిటీ రోడ్లపై సులభంగా తిరగడానికి వీలుగా ఉండే టూ-డోర్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్. దీని ధర దాదాపు రూ. 7 లక్షలకు ప్రారంభమవుతుంది. విన్‌ఫాస్ట్ VF 3 కాంపాక్ట్ సైజులో బాక్సీ లుక్‌తో వస్తుండటంతో దీనికి గట్టి పోటీ ఇస్తుంది.

టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
లుక్ పరంగా చూస్తే విన్‌ఫాస్ట్ VF 3 చిన్న ఎస్‌యూవీ లాగా ఉంటుంది. దాంతో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు బేస్ మోడల్ కొనుగోలుదారులను ఆకర్షించగలదు.