SUV MPV comparison India: కారు కొనాలని అనుకునే చాలా మంది ముందుగా చూడాల్సింది రెండు ముఖ్యమైన అంశాలు - డ్రైవింగ్‌ కంఫర్ట్‌ & ఇంజిన్‌ పనితీరు. ఈ రెండు పాయింట్లను మాత్రమే తీసుకుని Honda Elevate & Kia Carens Clavis (పెట్రోల్‌ NA వెర్షన్‌) మధ్య ఏది బెస్ట్‌ అనేది పోలిస్తే, Honda Elevate కొంచెం ముందంజలో కనిపిస్తుంది. కానీ, ఇదే ఎందుకు అంటే? సింపుల్‌గా అర్థమయ్యేలా ఇక్కడే తెలుసుకుందాం.

డ్రైవింగ్‌ కంఫర్ట్‌

Kia Carens Clavis డ్రైవ్‌ క్వాలిటీ విషయానికి వస్తే, ఈ కారు కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. ఈ సాఫ్ట్ సస్పెన్షన్‌ వల్ల సిటీ రోడ్లలో చిన్న చిన్న గుంతలు, స్పీడ్‌ బ్రేకర్‌లు వచ్చినా బాగా అబ్జార్బ్‌ చేస్తుంది. అంటే ప్యాసింజర్లకు మృదువైన రైడ్ ఫీలింగ్ ఇస్తుంది. కానీ హైవేలో హై స్పీడ్‌లో, పెద్ద కర్వ్‌లలో తిప్పేటప్పుడు ఈ సాఫ్ట్‌నెస్‌ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తేలిపోతున్న ఫీలింగ్ ఇవ్వొచ్చు.

Honda Elevate విషయానికి వస్తే, దీని సస్పెన్షన్‌ Carens Clavis లా సాఫ్ట్‌ కాకపోయినా, కంఫర్ట్‌ + స్టెబిలిటీ రెండిటినీ బ్యాలన్స్ చేస్తుంది. నగరంలో బాగా సాఫ్ట్‌గా ఉంటుంది, హైవేలో అయితే మరింత స్థిరంగా, కట్టుదిట్టమైన డ్రైవ్‌ ఫీలింగ్ ఇస్తుంది.

Telugu రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖ లాంటి పట్టణాల్లో వచ్చే రోడ్డు పరిస్థితులు, & రియల్-వ‌రల్డ్ డ్రైవింగ్‌కు Elevate ఇచ్చే ఈ స్టేబుల్ రైడ్‌ చాలా బాగా సరిపోతుంది.

ఇంజిన్‌ పనితీరు

Carens Clavis‌ లో 1.5-లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 115hp పవర్‌ ఇస్తుంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ కంఫర్ట్‌ కోసం రూపొందించిన ఇంజిన్‌. స్మూత్‌గానే ఉన్నా, పవర్ డెలివరీలో ఎక్కువ ఎగ్జైట్‌మెంట్ అనిపించదు.

Honda Elevate‌ లో వచ్చే 1.5-లీటర్‌ i-VTEC ఇంజిన్‌ 120hp పవర్‌తో మరింత ఫ్రీగా రేవ్‌ అయ్యే, క్విక్‌ రెస్పాన్స్ ఇచ్చే ఇంజిన్‌. సిటీ డ్రైవింగ్‌లో లాగానే, హైవే ఓవర్‌టేకింగ్‌లో కూడా Elevate ఇంజిన్‌ మరింత కాన్ఫిడెన్స్ ఇస్తుంది. Honda i-VTEC ఇంజిన్‌ను ప్రత్యేకంచి స్మూత్ రేవింగ్‌, లీనియర్ పవర్ డెలివరీ & పెర్ఫార్మెన్స్ పంచ్‌ కోసం చాలా మంది ఇష్టపడతారు. అదే విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

స్టెబిలిటీ & హ్యాండ్లింగ్

Carens Clavis‌ ఒక MPV తరహా వాహనం కావడంతో రైడ్ కంఫర్ట్‌కు ప్రాధాన్యం ఎక్కువ.

Elevate‌ ఒక SUV తరహా వాహనం కావడంతో రోడ్‌పై ఉండే స్టెబిలిటీ, కట్టుదిట్టమైన హ్యాండ్లింగ్‌ చాలా మెరుగ్గా అనిపిస్తాయి. ప్రత్యేకించి, హైవేలలో Elevate నడిపినప్పుడు సురక్షిత భావన, కంట్రోల్‌ ఎక్కువగా ఉంటుంది.

మొత్తంగా చూస్తే ఏది బెస్ట్?

మీరు ప్రత్యేకంగా రైడ్ కంఫర్ట్‌ + ఇంజిన్‌ పనితీరును మాత్రమే ఫోకస్‌ చేస్తే.. Honda Elevate స్పష్టంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది.

Carens Clavis కూడా మంచి వాహనమే, కాదనలేము. ప్రత్యేకంగా కుటుంబాల దృష్టితో చూస్తే డ్రైవింగ్‌ కంఫర్ట్‌ అద్భుతమే. కానీ ఇంజిన్‌ రెస్పాన్స్‌, స్టెబిలిటీ, మొత్తంగా డ్రైవింగ్ ఫీలింగ్‌ విషయాల్లో Elevate ముందుంటుంది.

తెలుగు రాష్ట్రాల కొనుగోలుదారులకు ఏది సరైనది?

సిటీ డ్రైవింగ్‌ ఎక్కువగా చేస్తున్నవాళ్లకు Clavis మంచి ఎంపిక

హైవే డ్రైవింగ్‌, లాంగ్ ట్రావెల్స్ ఎక్కువగా చేసే వాళ్లకు Elevate బెస్ట్

పెర్ఫార్మెన్స్ ఫీలింగ్ కూడా కావాలంటే.. Elevate క్లియర్‌ విన్నర్.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.