Yajnopaveetam : జంథ్యం, యజ్ఞోపవీతం, పూనులు, జనేవు...ఏ పేరుతో పిలిచినా ఒకటే. హిందూ సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ధరిస్తారు. యజ్ఞపవీతం ధరించేందుకు మంచి ముహూర్తం నిర్ణయించి ఉపనయనం జరిపిస్తారు.

జంథ్యం ఎప్పుడు ధరించాలి అనే ప్రశ్నకే తావులేదు..ఎందుకంటే 24 గంటలూ జంథ్యం ధరించే ఉండాలి

ఎప్పుడు తీయాలి/ మార్చుకోవాలి?

జంథ్యం సాధారణంగా తీయకూడదు కానీ కొన్ని సందర్భాల్లో పాతది తీసివేసి కొత్తది మార్చుకోవాలి.

ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి / రాఖీ పౌర్ణమి రోజు కొత్త యజ్ఞోపవీతం ధరిస్తారు. గాయత్రి మంత్రం జపిస్తూ యజ్ఞోపవీతం మార్చుకోవాలి

ఇంట్లో ఎవరిదైనా చావు సంభవించినప్పుడు అశౌచం ముగిసిన వెంటనే యజ్ఞోపవీతం మార్చుకోవాలి

ఇంట్లో జన్మించినప్పుడు..జాతాశౌచం ముగిసిన తర్వాత యజ్ఞోపవీతం మార్చుకోవాలి

జంథ్యం తెగిపోయినా, రంగు మారినా, జారిపోయినా , పాతబడినా వెంటనే కొత్తది ధరించాలి.. ఆలస్యం చేయకూడదు

గ్రహణాలు వచ్చినప్పుడు గ్రహణ సూతకాలం ముగిసిన తర్వాత స్నానమాచరించి యజ్ఞోపవీతం మార్చుకోవాలి

రజస్వల స్త్రీని తాకినప్పుడు కూడా జంథ్యం మార్చుకోవాల్సిందే

కొత్తది ధరించిన తర్వాతే పాత జంథ్యం తీసివేయాలి. ఉపనయనం జరిగిన తర్వాత నుంచి ఎప్పుడూ జంథ్యం లేకుండా ఉండకూడదు.

జంథ్యం ఎప్పుడు తీయొచ్చు?

స్నానం చేసినప్పుడు తీసి పక్కనపెట్టి...స్నానం అయ్యాక ధరించే సంప్రదాయం కొందరు పాటిస్తారు

అంత్యక్రియలు/శ్రాద్ధం వంటి అశుభ కార్యాల సమయంలో కొందరు యజ్ఞోపవీతం తీసేస్తారు

మలమూత్ర విసర్జన సమయంలో జంథ్యాన్ని చెవి వెనక్కు వేసుకోవాలి కానీ తీయకూడదు

పూజ, హోమం, వేదాధ్యయనం, సంధ్యావందనం సమయంలో తప్పనిసరిగా యజ్ఞోపవీతం ఉండాలి

ఉపనయనం అయిన తర్వాత జంథ్యం లేకుండా పూజచేయకూడదు..నిద్రపోకూడదు

జంథ్యాన్ని కాల్చడం, అపవిత్రం చేయడం, నేలపై పడేయడం చేయకూడదు

యజ్ఞోపవీతం ధరించిన తర్వాత గాయంత్రి మంత్రం నిత్యం జపించాలి.. సంధ్యావందనం చేయాలి. ఇవన్నీ మీ సంప్రదాయం, కులం, గోత్రం ప్రకారం కొన్ని మార్పులు ఉండొచ్చు. మీ ఇంటి పురోహితుడు లేదా గురువును సంప్రదించి పూర్తి నియమాలు తెలుసుకుని అనుసరించండి.

యజ్ఞోపవీత ధారణ విధానం

తూర్పు లేదా ఉత్తర ముఖంగా దేవుడి ముందు కూర్చుని ఆచమనీయంతో పూజ ప్రారంభించాలి, సంకల్పం గోత్రనామాలు చెప్పుకోవాలి. అశౌచం ఉంటే ప్రాయశ్చితార్థం అని కూడా చేర్చాలి. అనంతరం యజ్ఞోపవీత ధారణ మంత్రం చదువుతూ కుడి అరచేతిని పైకి చూపేలా పట్టుకుని ఈ మంత్రం పఠించాలి

యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతే యత్ సహజం పురస్తాత్ |
ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః ||

ఈ మంత్రాన్ని జపిస్తూ కొత్త జంథ్యాన్ని ఎడమభుజం మీదుగా కుడి చేతి కిందకు వచ్చేలా వేసుకోవాలి. జంథ్యం నాభి స్థాయికి సరిగా ఉండాలి. పైకి - కిందకు వేయకూడదు. గృహస్తులు రెండు మూడు జంథ్యాలు వేసుకుంటే ప్రతి ఒక్కటీ వేసుకునేటప్పుడు ఆచమనం చేసి మళ్లీ అదే మంత్రం చదవాలి. కొత్త జంథ్యం వేసుకున్నాక పాతది తీయాలి. తీసేసిన యజ్ఞోపవీతాన్ని పవిత్రమైన నదిలో వేయాలి. నేలపై పడేయకూడదు

కనీసం 10 సార్లు లేదా 28 సార్లు గాయత్రి మంత్రం జపించాలి

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్

ప్రాణాయామం చేసి సంధ్యావందనం పూర్తిచేయాలి

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.