Dual Channel ABS bikes India 2026: బైక్ రైడింగ్‌లో భద్రత చాలా కీలకం. ముఖ్యంగా అత్యవసర బ్రేకింగ్ సమయంలో బైక్ నియంత్రణ కోల్పోకుండా ఉండేందుకు డ్యూయల్ ఛానల్ ABS (Anti-lock Braking System) ఎంతో ఉపయోగపడుతుంది. ఈ టెక్నాలజీ వల్ల బలంగా బ్రేక్ వేస్తే కూడా ముందు, వెనుక చక్రాలు లాక్ కాకుండా నియంత్రణలో ఉంటాయి.

సింగిల్ ఛానల్ ABS ఉన్న బైకుల్లో ముందు చక్రానికి మాత్రమే ఈ వ్యవస్థ పని చేస్తుంది. అయితే వెనుక చక్రం లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. భారతదేశంలో చాలా మంది రైడర్లు వెనుక బ్రేక్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే డ్యూయల్ ఛానల్ ABS భద్రత పరంగా చాలా ముఖ్యమైన ఫీచర్‌గా మారింది.

ఇప్పుడు భారత మార్కెట్లో 125cc నుంచి 250cc వరకు ఉన్న అత్యంత చౌక డ్యూయల్ ఛానల్ ABS బైకుల జాబితా ఇదే.

Hero Xtreme 125R

ధర: రూ.1.05 లక్షలు

ఈ జాబితాలో అత్యంత చౌకైన డ్యూయల్ ఛానల్ ABS బైక్ Hero Xtreme 125R. ఇటీవల ఈ బైక్ టాప్ వేరియంట్‌లో ఈ సేఫ్టీ ఫీచర్‌ను హీరో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇది స్పోర్టీ 125cc కమ్యూటర్ సెగ్మెంట్‌లో డ్యూయల్ ఛానల్ ABS అందించే ఏకైక మోడల్. ఈ బైక్‌లో రైడ్ బై వైర్ థ్రోటిల్, రైడింగ్ మోడ్స్ (Power, Road, Eco), అలాగే క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Bajaj Pulsar N160

ధర: రూ.1.17 లక్షలు

బజాజ్ నుంచి వచ్చిన Pulsar N160 ఈ జాబితాలో రెండో అత్యంత చౌక బైక్. మంచి బ్యాలెన్స్, స్పోర్టీ డిజైన్ & మంచి పనితీరుతో ఈ బైక్ యువతలో మంచి ఆదరణ పొందింది.

ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా లభిస్తుంది.

Bajaj Pulsar NS160

ధర: రూ.1.20 లక్షలు

మరో పల్సర్ మోడల్ NS160 కూడా ఈ జాబితాలో ఉంది. ఇది స్పోర్టీ డిజైన్, పెరిమీటర్ ఫ్రేమ్, USD ఫోర్క్ వంటి ఫీచర్లతో వస్తుంది.

డ్యూయల్ ఛానల్ ABS ఇందులో స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంది.

TVS Apache RTR 160 2V

ధర: రూ.1.23 లక్షలు

టీవీఎస్ ఇటీవల Apache RTR 160 2Vను కొత్త OBD2B నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. అదే సమయంలో ఈ బైక్ టాప్ వేరియంట్‌లో డ్యూయల్ ఛానల్ ABSను కూడా అందించింది.

TVS Apache RTR 160 4V

ధర: రూ.1.26 లక్షలు

Apache RTR 160 4V టాప్ మూడు వేరియంట్లలో డ్యూయల్ ఛానల్ ABS లభిస్తుంది. ఈ బైక్‌లో ట్రాక్షన్ కంట్రోల్, TFT డిస్ప్లే, USD ఫోర్క్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Bajaj Pulsar NS200

ధర: రూ.1.32 లక్షలు

పల్సర్ NS200 ఈ జాబితాలో అత్యంత శక్తివంతమైన బైకుల్లో ఒకటి. ఇందులో 200cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది.

సుమారు 24.5hp పవర్ ఇచ్చే ఈ బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఉంటుంది.

Bajaj Pulsar N250

ధర: రూ.1.33 లక్షలు

Pulsar N250లో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఎక్కువ టార్క్ ఇచ్చే బైక్‌గా గుర్తింపు పొందింది. సిటీ రైడింగ్‌తో పాటు హైవే ప్రయాణాలకు కూడా ఇది అనువైనది.

డ్యూయల్ ఛానల్ ABS ఇందులో కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంటుంది.

TVS Apache RTR 200 4V

ధర: రూ.1.45 లక్షలు

ఈ జాబితాలో అత్యంత ఖరీదైన బైక్ Apache RTR 200 4V. అయితే ఫీచర్ల పరంగా ఇది చాలా అడ్వాన్స్‌డ్ మోడల్.

ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్స్, TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, క్రాష్ అలర్ట్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్యూయల్ ఛానల్ ABS మధ్య వేరియంట్ నుంచి అందుబాటులో ఉంటుంది.

మొత్తానికి, మన దేశంలో ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ABS ఉన్న బైకులు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా Hero, Bajaj, TVS వంటి కంపెనీలు ఈ భద్రత ఫీచర్‌ను తక్కువ ధరలో అందించడం ప్రారంభించాయి.

భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రైడర్లకు ఈ బైకులు మంచి ఎంపికలుగా నిలుస్తాయి. ముఖ్యంగా... రోజువారీ ప్రయాణాలకు, వర్షాకాలంలో, తడి రోడ్లపై రైడింగ్‌కు డ్యూయల్ ఛానల్ ABS ఉన్న బైక్ మరింత భద్రతను అందిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.