ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాలీవుడ్‌కి వీళ్లే అడ్డంకి!

2 days ago 1
ARTICLE AD

ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌కు సమానమైన వినోద పరిశ్రమను నిర్మించడం సాధ్యమేనని ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బల్లగుద్ది చెబుతున్నారు. వైజాగ్‌లో ఇప్పటికే ఉన్న ఫిలిం స్టూడియోలలో రికార్డింగ్ థియేటర్లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయ‌ని.. స్టూడియోలు మ‌రిన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. సినిమా నిర్మాణానికి ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని ఆయన విశ్లేషించారు. 

ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ స్థాయి పరిశ్రమ ఏర్పడకపోతే తనను అడగాలని ఆయన సవాల్ చేయడం... అక్కడ ఉన్న వనరులపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. అయితే పరిశ్రమ అభివృద్ధి కేవలం 20 మంది పెద్ద నిర్మాతల చేతుల్లోనే ఉండకూడదని.. మిగిలిన 180 మంది చిన్న నిర్మాతలకు అవసరమైన మౌళిక సదుపాయాలు షూటింగ్ లొకేషన్లలోనే కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే... టాలీవుడ్‌కు హైదరాబాద్ మాత్రమే దిక్కు అనే భావనను చెరిపివేయడానికి ప్రభుత్వాలు, సినీ పెద్దలు మరింత చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. కేవలం వ్యాపార దృక్పథంతో ఆలోచించే పెద్ద నిర్మాతల కంటే... ప్ర‌తిసారీ ఇబ్బందులు పడే చిన్న నిర్మాతలకు వైజాగ్ వంటి నగరాల్లో రాయితీలతో కూడిన స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు అందుబాటులోకి రావాలి. 

కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. రికార్డింగ్ , సాంకేతిక వసతులను స్థానికంగా పటిష్టం చేసినప్పుడే ఏపీలో సినీ పరిశ్రమ విస్తరిస్తుంది. షూటింగ్ చేసిన చోటే అన్ని పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగితే.. టాలీవుడ్ వికేంద్రీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్ కూడా సినిమా రంగానికి మరో ప్రధాన కేంద్రంగా మారుతుంది. అయితే ఏపీ టాలీవుడ్ ని అమ‌రావ‌తిలో నిర్మిస్తారా?  లేక బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో నిర్మిస్తారా? అన్న‌దానిపై ప్ర‌భుత్వాల నుంచి మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

Read Entire Article