<p>Alluri Blasting Accident | అనంతగిరి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరి మండలం పినకోట గ్రామం సమీపంలో రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా కొండరాళ్లను తొలగించేందుకు కాంట్రాక్టర్లు ప్రైవేట్ బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. ఈ క్రమంలో బండరాళ్లను పగులగొట్టేందుకు జిలెటిన్ స్టిక్స్ అమర్చిన ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. అయితే, ఊహించని విధంగా ఆ ప్రత్యేక పరికరం, పేలుడు పదార్థాలు మిస్‌ఫైర్ కావడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ టీచర్ సహా మొత్తం ఐదురుగురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.</p>
<p>అక్కడ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఓ డ్రైవర్, ముగ్గురు కార్మికులతో పాటు, అదే సమయానికి ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ స్కూల్ టీచర్ దుర్మరణం చెందారు. పేలుడు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిని సునీత అనే టీచర్ (విశాఖ), కడపకు చెందిన పవన్ కుమార్, దేవరాపల్లికి చెందిన మణి, చీడకాడకు చెందిన నారాయణ రావు, మరో వ్యక్తి చనిపోయారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>