Assets of MVV have been attached by ED: వైఎస్ఆర్‌సీపీకి చెందిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లుగా ఈడీ ప్రకటించింది. హయగ్రీవ డెవలపర్స్ తో చేసుకున్న ఒప్పందంలో అక్రమ నగదు చెలామణి చేసినట్లుగా తేలడంతో అటాచ్ చేశామని ఈడీ తెలిపింది. రూ. 42 కోట్లకుపైగా విలువ కలిగిన స్థిరాస్తులు, రెండు కోట్లకుపైగా విలువ కలిగిన చరాస్తులు అటాచ్ చేసిన వాటిలో ఉన్నట్లుగా ఈడీ తెలిపింది. ఎంవీవీ బిల్డర్, హయగ్రీవఇన్ ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్, గద్దె బ్రహ్మజీ, అతని భార్య, చిలూకూరి జగదీశ్వరుడు, రాధారాణి వంటి వారి ఆస్తులు అటాచ్ చేసిన వాటిల్లో ఉన్నాయి. [

ED, Visakhapatnam has provisionally attached 14 immovable properties worth Rs. 42.03 Crore and six movable properties worth Rs. 2.71 Crore under the provisions of the PMLA, 2002 in connection with investigation regarding fraudulent alienation of land measuring 12.51 acres…

— ED (@dir_ed) February 7, 2025

వృద్దులు, అనాథలకు నిర్మించేందుకు విశాఖలోని ఎండాడలో 2008లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు 12.44 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించింది. అక్కడ కట్టే ఇళ్లు వృద్ధులకు మాత్రమే విక్రయించాలన్నది నిబంధన. కానీ ఆ భూమిలో జగదీశ్వరుడు ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. నిబంధనలు ఉల్లంఘించినందున తర్వాత ప్రభుత్వాలు భూకేటాయింపుల రద్దుకు ప్రయత్నించగా, ఆయన కోర్టులకు వెళ్లి తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వతా జగదీశ్వరుడు మొదట గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తికి హయగ్రీవ సంస్థలో 75 శాతం వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు అలియాస్ జీవీ పేరిట జీపీఏ చేశారు. వీఎంఆర్డీఏ, జీవీఎంసీ నుంచి అనుమతుల్లేకుండానే ఆ భూమిని 30 మందికి వెయ్యి గజాలు చొప్పున అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తాను ఎవరికీ జీపీఏ చేయలేదని అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్‌ జీవీ తన నుంచి ఆ భూమిని బలవంతంగా చేజిక్కించుకున్నారని జగదీశ్వరుడు 2021లో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు.

మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఆ భూమిని కబ్జా చేశారని జగదీశ్వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నిర్మాతగా పలు సినిమాలు తీసిన ఎంవీవీ విశాఖపట్నంలో ప్రముఖ బిల్డర్ గా ఉన్నారు. అయితే ఆయనపై అనేక వివాదాలు ఉన్నాయి. భూ వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన కుటుంబాన్ని కొంత మంది రౌడీషీటర్లు ఇంట్లోనే బంధించి డబ్బులు డిమాండ్ చేశారు. తర్వాత కిడ్నాప్ చేశారని.. మధ్యలో కాపాడామని పోలీసులు ప్రకటించారు. దానిపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఆయన ఆస్తుల్ని జప్తు చేయడం సంచలనంగా మారింది.