YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో పర్యటించేందుకు యత్నించిన వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకున్నారు. తమను అన్యాయం చేసి ఇప్పుడు పర్యటనకు ఎందుకు వస్తున్నారని నిలదీశారు. అడుగు ముందుకు వేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. వారిపై కోడిగుడ్లతో దాడులు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు, ప్రత్యేక బలగాలు యత్నించాయి.

అమరావతిలో ప్రభుత్వం అక్రమాలు చేస్తోందని బలవంతంగా భూములు లాక్కొంటోందని వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తోంది. రాజధాని పేరుతో కోట్ల రూపాయలు అప్పులు చేస్తోందని వాదిస్తోంది. కానీ అక్కడ ప్రజల, రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. ఇప్పటికే కొందరు రైతులు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. వారి బాధలను చెప్పుకొన్నారు. వారి సమస్యలు విన్న జగన్ ప్రత్యేక కమిటీ వేస్తున్నట్టు వెల్లడించారు. వెంటనే పది మందితో సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నేడు పెనుమాక గ్రామంలో పర్యటించింది. దీన్ని రాజధాని రైతులు వ్యతిరేకిస్తున్నారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చంపేసే ప్రయత్నం చేశారని రైతులు వాపోతున్నారు. మూడు రాజధానుల పేరుతో నాటకాలు ఆడారని మండిపడుతున్నారు. తమపై అక్రమ కేసులు పెట్టారని, ఆడవాళ్లను హింసించారని గుర్తు చేస్తున్నారు. ప్రశ్నించిన తమపై బూతులతో నేతలు రెచ్చిపోయారని చెబుతున్నారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు తమకు సమస్యలు ఉన్నాయనే వంకతో రాజధానిలో పర్యటించడం సరికాదని అంటున్నారు. అందుకే వైసీపీ నేతలు అడ్డుకుంటున్నామని రాజధాని రైతులు తెలిపారు.

వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, ఎం. అరుణ్‌కుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వి.డైమండ్ బాబు, మనోహర్ రెడ్డి., సుదర్శన్ రాజధాని రైతులతో సమావేశమయ్యేందుకు యత్నించారు. వారిని రైతులు అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా మహిళలు సైతం రోడ్లపైకి వచ్చారు. మరోసారి అమరావతికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వారిని ముందుకు వెళ్లనీయకుండా రోడ్డుపై బైఠాయించారు.

పోలీసులు జోక్యం చేసుకున్నా రైతులు వినిపించుకోలేదు. వైసీపీ నేతలు రాజధానిలో అడుగు పెట్టడానికి లేదని భీష్మించారు. ప్రత్యేక బలగాలు వచ్చిన వారిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. భారీ సంఖ్యలో రైతులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే కొందరు రైతులు తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్లతో వైసీపీ నేతల కార్లపై దాడి చేశారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన పోలీసులు వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపేశారు.