YSRCP Cadre Dissatisfaction Sajjala Influence: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, కొత్త రాజకీయ పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విడుదల చేసిన రెండు పేజీల ఓపెన్ లెటర్ ఆ పార్టీలో పెద్ద తుఫానునే సృష్టించింది. కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే కాకుండా, ఏకంగా వైఎస్సార్‌సీపీ మునిగిపోతున్న నౌకగా మారడానికి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనబడే ఓ శక్తివంతమైన కోటరీనేనని ఆయన నేరుగా నిందించడం సంచలనం రేపింది. కొత్త పార్టీ ఆవిర్భావానికి ముందే సాయిరెడ్డి విసిరిన ఈ సవాలు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ చదరంగంలో సజ్జల పాత్రపై ఉన్న ఆరోపణలను ఒక్కసారిగా క్యాడర్ ముందుకు తీసుకొచ్చింది.

అమాంతం పెరిగిన సజ్జల కోటరీ

గడిచిన కొన్నేళ్ల పరిణామాలను పరిశీలిస్తే, వైఎస్సార్‌సీపీ సాధించిన 2019 ఘనవిజయం తర్వాతి కాలంలో పార్టీలో సజ్జల ప్రభావం అమాంతం పెరిగిపోయిందనేది రాజకీయ వర్గాల్లో బహిరంగ రహస్యమే. అయితే ఆశ్చర్యకరంగా సజ్జల చేతికి తాడేపల్లి పవర్ సెంటర్ వచ్చినప్పటి నుంచే జగన్‌కు వరుస ఎదురుదెబ్బలు తగలడం మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవడం, ఢిల్లీ స్థాయిలో పార్టీకి సంబంధాలు తెగిపోవడం, కీలకమైన నంబర్-2 నాయకులంతా పక్కకు తప్పుకోవడం, చివరకు వైఎస్ కుటుంబంలోనే చీలిక వచ్చి షర్మిల, విజయమ్మలు దూరమవ్వడం వంటివన్నీ సజ్జల పర్యవేక్షణ కాలంలోనే జరిగాయి.

సజ్జలను జగన్‌కు దూరం చేసే ప్లాన్

సాయిరెడ్డి లేఖ సజ్జలపై విసిరిన విమర్శ మాత్రమే కాదు. అది జగన్ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు, కోటరీ చేతిలో బందీ అయ్యారు అన్న సత్యాన్ని పార్టీ కేడర్‌కు నమ్మించేలా వేసిన పక్కా పొలిటికల్ స్కెచ్ 2024 దారుణ ఓటమి తర్వాత కూడా తాడేపల్లి గడప దాటి అసలు నిజాలు జగన్‌కు చేరకపోవడానికి సజ్జల వ్యవహారశైలే కారణమని గ్రామ స్థాయి నాయకుల వరకు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. సాయిరెడ్డి బహిరంగంగా లేఖ రాయడం ద్వారా, ఆ నిరాశలో ఉన్న కేడర్ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడానికి లేదా వారిలోని అసమ్మతిని బయటకు తేవడానికి బలమైన పునాది వేశారు.

జగన్ లీడర్‌షిప్ ఇమేజ్ పై దెబ్బ

జగన్ నమ్మకస్థుడిగా 15 నెలలు జైలు జీవితం గడిపిన సాయిరెడ్డి వంటి నేతను సైతం అవమానించి పంపేశారని చూపించడం ద్వారా, పార్టీ కోసం కష్టపడిన వారిని కాపాడుకోలేక కోటరీని మోసే నాయకుడు " అనే ముద్ర జగన్‌పై పడేలా చేశారు. ఇది భవిష్యత్తులో మిగిలిన ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ మారడానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. విజయసాయిరెడ్డి లేఖతో ఇప్పుడు వైఎస్సార్‌సీపీ తాడేపల్లి వర్గాలు రక్షణ ధోరణిలోకి వెళ్లక తప్పడం లేదు. సజ్జలను సమర్థించుకుంటే సొంత పార్టీ శ్రేణులే తిరగబడే పరిస్థితి, ఆయనను పక్కన పెడితే తప్పు ఒప్పుకున్నట్లు అయ్యే పరిస్థితి జగన్‌కు ఎదురైంది.

సాయిరెడ్డి విమర్శలకు ఇక స్పందించనంటున్న స్జజల

విజయసాయిరెడ్డి సృష్టించిన ఈ రాజకీయ అలజడి కేవలం సజ్జల వర్సెస్ సాయిరెడ్డి యుద్ధం మాత్రమే కాదు. వైఎస్సార్‌సీపీ ఎంత త్వరగా తన తప్పులను సరిదిద్దుకోకపోతే అంత వేగంగా ఖాళీ అవుతుందనే హెచ్చరిక. ఢిల్లీ పెద్దలతో సంబంధాలు లేక, రాష్ట్రంలో ప్రజా క్షేత్రంలో నిలబడలేక, కుటుంబం అండ కోల్పోయి, ఇప్పుడు అంతర్గత కోటరీ రాజకీయాల్లో మునిగిపోతున్న వైఎస్సార్‌సీపీ నుంచి క్యాడర్ పక్కకు జరగడానికి సాయిరెడ్డి వేసిన ఈ టైమ్ బాంబ్ ' ప్రధాన కారణం కానుంది. ఈ లేఖ ద్వారా విజయసాయిరెడ్డి జగన్‌ను సజ్జల నుంచి వేరుచేసే ప్రయత్నం చేయలేదు. సజ్జలను నమ్ముకున్న జగన్‌కు పార్టీలో భవిష్యత్తు లేదనే సంకేతాన్ని క్యాడర్‌కు బలంగా పంపించారు. ఈ అగ్గి రాబోయే రోజుల్లో వైఎస్సార్‌సీపీలో ఎలాంటి రాజీనామాలు లేదా గ్రూపు జగడాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.