YS Jagan On Chandrababu: ఎన్నికలకు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చడం లేదని జగన్ మండిపడ్డారు. తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఎక్స్ లో ఆయన సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు.

ఎన్ని కేబినెట్ సమావేశాలు జరిగినా పట్టించుకోరా?

మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్‌ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరంమీద తప్ప, ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తులమీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారన్నారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది ..గుర్తుందా ?

మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్‌నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్‌ని వెళ్లగొట్టారు. ఆతర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారని విమర్శించారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్‌ పేమెంట్స్‌ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్‌. దసరా పండుగకు డీఏలు క్లియర్‌ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదన్నారు.

ఉద్యోగులు నమ్మి మోసపోతున్నారు !

CPS/GPSలను పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పారు. కాని, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారైనా దీనిమీద రివ్యూచేశారా? మా ప్రభుత్వ హయాంలో CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్యోగులకోసం GPS తీసుకు వచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మీరు.. OPSను తీసుకువస్తామన్నారు. మాకంటే గొప్పగా చేస్తామన్నారు. కాని ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి వారు తీవ్రంగా నష్టపోతున్నా, మీలో ఏ మాత్రం చలనం లేదు. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన PRC బకాయిలు, పెండింగ్‌ డీఏలు, GPF, APGLI, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, సరెండర్‌ లీవ్స్‌ లేదా ఎన్‌క్యాష్ మెంట్‌ లీవులు… వీటి కింద దాదాపు రూ.31వేల కోట్ల బకాయిలు పెట్టారు. తమకు రావాల్సినవాటికోసం ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్నా ఒక్కపైసా కూడా ఇవ్వకపోవడంతో, వారంతా నరకయాతన అనుభవిస్తున్నారని గుర్తుచేశారు.

.@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W

— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025

జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి !

ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాలకోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. ఉద్యోగులకు EHSకింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్‌ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదని మండిపడ్డారు. వారంతా రోడ్డెక్కుతున్నారని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.