YS Jagan Press Meet Highlights: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన పాలన సాగుతోందని, రైతులను, ఇతర వర్గాలను ఆదుకోవాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైఎస్‌ జగన్ ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని, బీసీలకు మేలు చేశామని వెల్లడించారు. బీసీలు, రైతులు, మాదకద్రవ్యాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రెడ్‌బుక్ అమలులో బిజీగా ఉన్న చంద్రబాబు కరవు పరిస్థితులను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మాఫియా పాలన నడుస్తోందని అన్ని రంగాల్లో దోపిడీ మాత్రమే సాగుతోందని, ప్రశ్నించే వారిపై వేధింపులు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరవు తాండవిస్తోందని జగన్ అన్నారు. పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉంటే చంద్రబాబు నుంచి స్పందన లేదని మండిపడ్డారు. భారీగా లోటు వర్ష పాతం నమోదు అవుతున్నా దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదన్నారు. నీళ్లు ఇస్తున్నట్టు చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసుకున్నారని, దీన్ని నమ్మిన రైతులు పంటలు వేసి మోసపోయారని ఆరోపించారు. ఒకవైపు వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు నీటి విషయంలో మోసం చేసి మానవత్వం లేకుండా వ్యవహరించారని అన్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని విద్యుదుత్పత్తికి వాడేస్తున్నారని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మరోవైపు తెలంగాణ కూడా నీటిని తరలించుకుపోతుంటే చంద్రబాబు స్పందించడం లేదని అన్నారు. అవకాశం ఉన్న చోట నీరు ఇవ్వకుండా రైతు గొంతు కోస్తున్నారని ఆరోపించారు.

సెప్టెంబర్ 15 నాటికి వర్షాలు ఆగిపోతాయని, తర్వాత పరిస్థితులు మరింత దుర్బరంగా మారతాయని జగన్ హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని ఆరోపించారు. తర్వాత ప్రాజెక్టుల్లో నీరు ఇచ్చే పరిస్థితి లేదని, రైతులను ఎలా ఆదుకుంటారో చంద్రబాబు చెప్పడం లేదని నిలదీశారు. ఒకపైపు నీరు ఇవ్వకుండా చేయడమే కాకుండా ఉచిత పంట బీమా పథకాన్ని నిర్వీర్యం చేశారని అన్నారు. ఇది కేంద్రమే స్వయంగా చెప్పిందని వివరించారు. ఉచిత పంట బీమాతోపాటు ఉచిత విత్తనాల పంపిణీ, సున్నా వడ్డీకే రుణాలు ఇలా తాము తీసుకొచ్చిన పథకాలను ఆపేసి రైతులను ముంచేశారని అన్నారు. వారికి ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ పథకం డబ్బుల్లో కోత పెట్టారని అన్నారు. తమ హయంలో రైతులను ఆదుకొని వారికి మంచి చేస్తే చంద్రబాబు మాత్రం రైతులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.