World Head Injury Awareness Day: ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా World Head Injury Awareness Dayను నిర్వహిస్తారు. ప్రమాదాల కారణంగా తలకు తగిలే గాయాలు, తీవ్రతను, వాటి వల్ల కలిగే ప్రాణాపాయాన్ని, వైకల్యాన్ని ప్రజలకు వివరించడమే ఈ రోజు ప్రత్యేకత. ముఖ్యంగా టూవీలర్స్‌ డ్రైవ్ చేసే వాళ్లు హెల్మెట్‌ ధరించడం ద్వారా తమ ప్రాణాలను ఎలా కాపాడుకోవచ్చో అవగాహన కల్పించడం ఈ సందర్భంగా చాలా కీలకం.

భారత్‌ దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం టూవీలర్స్‌ వాహనాలకు సంబందించినవే ఉంటున్నాయి. ఈ ప్రమాదాలే మెదడుకు తీవ్రమైన కాయాలు చేస్తున్నాయి. జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ ఇన్ రూరల్ ప్రాక్టీస్ నిర్వహించిన ఒక స్టడీ ప్రకారం, తలకు గాయాలైన కేసుల్లో 71 శాతం మోటార్ సైకిల్ ప్రమాదాల వల్లే జరుగుతున్నాయి. విచారకరమైన విషయం ఏంటంటే ఇందులో 1 శాతాని కంటే తక్కువ మంది మాత్రమే హెల్మెట్ ధరించి ఉన్నట్టు తేలింది.

ఈ మరణాల రేటును గమనిస్తే ఎక్కువ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువకులే తల పుర్రె పగిలి లేదా మెదడులో రక్తస్రావమై చనిపోతున్నారు. సరైన హెల్మెట్ ధరించడం వల్ల తల గాయాల ప్రమాదం 69 శాతం తగ్గుతుందని అలాగే మరణాల ముప్పు 42 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం తలకే కాకుండా, మెడకు అయ్యే గాయాలను తగ్గించడంలో కూడా హెల్మెట్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయని విస్కాన్సిన్‌ విశ్వవిద్యాలయం పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

ఫుల్ ఫేస్ హెల్మెట్‌ వర్సెస్‌ హాఫ్ ఫేస్ హెల్మెట్‌ ఏదీ మంచిది?

చాలా మంది వాహనదారులు కేవలం పోలీసుల నుంచి తప్పించుకోవడానికో లేదా సౌకర్యం కోసమో హాఫ్‌ఫేస్ హెల్మెట్‌ లేదా ఓపెన్ ఫేస్ హెల్మెట్‌లను వాడుతుంటారు. కానీ రక్షణ విషయంలో ఫుల్ ఫేస్ హెల్మెట్లకు ఏదీ సాటి రాదని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.

ఖోన్‌ కీన్ యూనివర్శిటీ పరిశోధన ప్రకారం

ఫుల్ ఫేస్‌ హెల్మెట్‌ తల , మెడకు తగిలే గాయాలను 64శాతం అదనంగా తగ్గిస్తుంది. అలాగే ఓపెన్ ఫేస్ రకాలతో పోలిస్తే 36 శాతం ఎక్కువ రక్షణ కల్పిస్తాయి. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 35శాతం కేసుల్లో దవడ, గడ్డం, ముఖంపై నేరుగా ప్రభావం పడుతుంది. ఫుల్ ఫేస్ హెల్మెట్లు మాత్రమే ఈ భాగాలను పూర్తిగా కప్పి ఉంచి, లోపల ఉండే ఇంపాక్ట్ అబ్జార్బింగ్‌ ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గిస్తాయి. హాఫ్ ఫేస్‌ హెల్మెట్‌లు కేవలం తల పైబాగాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. ముఖం, దవడ భాగాలను గాలికి వదిలేస్తాయి. ఇవి ఇంటర్నేషనల్‌ ప్రమాణాలు లేదా, భారతీయ ISI ప్రమాణాల ప్రకారం క్రాష్ టెస్టులో పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేవని తేలింది.

చట్టం ఏం చెబుతోంది

భారతీయ చట్టాల ప్రకారం టూవీలర్స్ నడిపే వారు మాత్రమే కాదు, వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగేళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 129 స్పష్టం చేస్తోంది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్స్‌ నిర్దేశించిన ISI మార్క్ ఉన్న హెల్మెట్‌లు మాత్రమే ధరించాలి. ఇవి ప్రమాద సమయంలో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ నిబంధనను ఉల్లంఘిస్త వెయ్యి రూపాయల వరకు జరిమానా విధించడమే కాకుండా, వాహనాదారుడి లైసెన్స్‌ మూడు నెలల పాటు రద్దు చేసే అధికారం అధికారులకు ఉంది.