Diabetes Warning Signs : నేటి బిజీ లైఫ్‌లో మధుమేహం వంటి వ్యాధి ఎవరినైనా రహస్యంగా అటాక్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 83 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే సగానికి పైగా మందికి వారి శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగాయని తెలియదట. భారతదేశంలో కూడా ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) 2025 డయాబెటిస్ అట్లాస్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు దీని బారిన పడ్డారు. 2.5 కోట్ల మందికి ఇప్పటికీ ఈ విషయం తెలియదట(Silent Killer Diabetes).

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా.. మధుమేహం ఉన్నట్లు సూచించే 5 లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రారంభ లక్షణాలు డయాబెటిస్ను సూచిస్తాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? చక్కెర స్థాయిలను అదుపులోకి తెచ్చుకునేందుకు నిపుణులు సూచించే మార్గాలు ఏంటో చూసేద్దాం.

మధుమేహ ప్రభావం ఎలా ఉంటుందంటే..

ఢిల్లీలో ఎండోక్రినాలజీ విభాగ ఛైర్మన్ డాక్టర్ వి. సుబ్రమణ్యం ప్రకారం.. మధుమేహాన్ని సైలెంట్ కిల్లర్ (Silent Killer Diabetes) అని పిలుస్తారు. ఎందుకంటే ఇది గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలను నెమ్మదిగా దెబ్బతీసి.. నష్టం కలిగిస్తుంది. మీకు తరచుగా మూత్రం వస్తుంటే లేదా ఎక్కువ దాహం వేస్తుంటే.. అలసట, బరువు తగ్గడం, దృష్టిలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే రక్త పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ లక్షణాలు టైప్-2 మధుమేహంలో ఎక్కువగా కనిపిస్తాయని.. 90 శాతం కేసులు ఇదే మాదిరి ఉంటాయని చెప్తున్నారు.

రాత్రి కనిపించే ఆ లక్షణం.. మూత్రపిండాలే టార్గెట్

మధుమేహం మొదటి లక్షణం తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం. వాస్తవానికి రక్తంలో చక్కెర పెరిగినప్పుడు.. మూత్రపిండాలు దానిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తాయి. దీని కారణంగా రాత్రి సమయంలో కూడా 4-5 సార్లు వాష్రూమ్కి వెళ్లాల్సి ఉంటుంది. డాక్టర్ సుబ్రమణ్యం ప్రకారం.. రోగులు తరచుగా రాత్రంతా నిద్రపోలేకపోతున్నామని చెబుతారు. ఎందుకంటే వారు మూత్రాన్ని ఆపలేరు. ఇది ప్రారంభ సంకేతం. దీనిని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలు దెబ్బతింటాయి. IDF నివేదిక ప్రకారం సమయానికి పరీక్ష చేయించుకోకపోతే 40 శాతం మంది మధుమేహ రోగులకు మూత్రపిండాల సమస్యలు వస్తాయి.

తరచుగా దాహం వేయడం.. ఇది కూడా ప్రమాదకరమే

రెండవ లక్షణం దాహం తరచుగా వేయడం. శరీరంలో చక్కెర పెరగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. మీరు ఎంత ఎక్కువ నీరు తాగినా.. దాహం వేస్తూనే ఉంటుంది. డాక్టర్ సుబ్రమణ్యం ప్రకారం వేసవిలో దాహం వేస్తుంది. కానీ చల్లని వాతావరణంలో కూడా మీరు పదేపదే నీరు తాగవలసి వస్తే.. షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఇటీవల ఒక అధ్యయనంలో 70 శాతం మంది రోగులలో ఈ లక్షణం మొదటిగా కనిపించిందట. ADA (అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్) 2025 మార్గదర్శకాలలో కూడా దాహం పెరగడం హైపర్గ్లైసీమియాకు సంకేతమని తెలిపింది.

నిరంతర అలసట.. ఇగ్నోర్ చేయకండి

మధుమేహంలో కణాలు చక్కెరను శక్తిగా మార్చలేవు. దీని కారణంగా ఎల్లప్పుడూ అలసట అనిపిస్తుంది. డాక్టర్ సుబ్రమణ్యం ప్రకారం.. రోగులు పని అలసట అని అనుకుంటారు. కానీ ఇది మధుమేహం వల్ల జరుగుతుంది. WHO అధ్యయనం ప్రకారం మధుమేహానికి చికిత్స చేయకుంటే అలసట పెరిగి గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందట.

అకస్మాత్తుగా బరువు తగ్గితే

టైప్-1 మధుమేహం సమయంలో బరువు చాలా వేగంగా తగ్గడం మొదలవుతుంది. ఎందుకంటే శరీరం కొవ్వు, కండరాలను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఒక నెలలో 4-5 కిలోల బరువు తగ్గడం సాధారణం కాదు. ఇది ఇన్సులిన్ లోపం సంకేతం. IDF తాజా నివేదిక ప్రకారం.. భారతదేశంలో 10 మిలియన్ల టైప్-1 కేసులు ఉన్నాయి. వీటిలో ఈ లక్షణం ప్రధానమైనది.

కంటిచూపులో మార్పులు.. చూపు మందగిస్తే

మధుమేహం లక్షణాల్లో కళ్లు అస్పష్టంగా కనిపించడం ఒకటి. వాస్తవానికి అధిక చక్కెర కారణంగా.. కంటి కటకంలో వాపు వస్తుంది. దీనివల్ల దృష్టి మసకబారుతుంది. డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ డయాబెటిక్ రెటినోపతీ కారణంగా 20 శాతం మంది రోగులు అంధులు అవుతారట. 2025 ADA నివేదిక ప్రకారం.. ప్రారంభ పరీక్షలతో 80 శాతం కేసులను నివారించవచ్చట. ఈ లక్షణం పిల్లలలో కూడా వేగంగా పెరుగుతోందని తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

మధుమేహాన్ని నియంత్రించాలనుకుంటే.. చక్కెర, మైదా, ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ మానుకోవాలని డాక్టర్ సుబ్రమణ్యం సలహా ఇస్తున్నారు. దీనికి బదులుగా ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలట. IDF 2025లో ప్రచురించిన నివేదికలో ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా 58 శాతం కేసులను నివారించవచ్చని తెలిపింది. ఫుడ్తో చేసే మార్పులతో పాటు.. తేలికపాటి వ్యాయామం చేయండి. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య అల్పాహారం తీసుకోండి. ఇందులో 300 కేలరీలు ఉండాలి. ఆపిల్, జామ లేదా బొప్పాయి వంటి ఫ్రూట్స్ తినొచ్చు. అరటిపండును తగ్గించండి. లంచ్లో బ్రౌన్ రైస్, పప్పు, ఆకుకూరలు, సలాడ్ తీసుకోవచ్చు. సాయంత్రం ఒక గుప్పెడు బాదం లేదా మొలకలు తినండి. మద్యం, స్మోకింగ్కి దూరంగా ఉంటూ.. యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం చేస్తే మధుమేహం కంట్రోల్ అవుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.