When will the Iran-Israel war end:  పస్చిమాసియా ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం సైనిక ఘర్షణగా కాక, దేశాధినేతల మధ్య అహంకార పోరాటం గా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు , ఇరాన్ నూతన నాయకత్వం మధ్య నెలకొన్న ఈగో వార్ పరస్పర విరుద్ధ ప్రకటనలు ఈ యుద్ధాన్ని ఒక అంతులేని వ్యూహంలోకి నెట్టేస్తున్నాయి.

మొత్తం క్లీన్ చేశామన్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తాము ఇప్పటికే తుడిచిపెట్టామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌లో ఇక కొట్టడానికి లక్ష్యాలేమీ లేవు అని ఆయన పేర్కొనడం వెనుక.. అమెరికా తన సైనిక వ్యయాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన కనిపిస్తోంది. యుద్ధాన్ని తాను ఎప్పుడైనా ఆపేయగలనని, అది తన చేతుల్లోనే ఉందని చెప్పడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇరాన్ గడ్డపై కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసిన తర్వాత, అమెరికా ఇప్పుడు విజయం ప్రకటించి వెనక్కి తగ్గాలని చూస్తోంది.

కోలుకోని దెబ్బ కొట్టాలంటున్న ఇజ్రాయెల్

ట్రంప్ ప్రకటనలకు భిన్నంగా ఇజ్రాయెల్ మాత్రం తన దూకుడును తగ్గించడం లేదు. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి తయారీ కేంద్రాలు ఇంకా పూర్తిగా ధ్వంసం కాలేదని, ఇరాన్ మళ్ళీ తలెత్తుకోకుండా చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అమెరికా యుద్ధాన్ని ముగించాలనుకున్నా, ఇజ్రాయెల్ మాత్రం తన భద్రత కోసం ఒంటరి పోరాటానికైనా సిద్ధమని సంకేతాలిస్తోంది. ఇక్కడే ఈగో స్పష్టంగా కనిపిస్తోంది—అమెరికా తన మాట నెగ్గించుకోవాలని చూస్తుంటే, ఇజ్రాయెల్ తన ప్రాంతీయ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.

ఇరాన్ షరతులు

మరోవైపు, తీవ్ర దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్ అస్సలు తగ్గడం లేదు. యుద్ధం ముగియాలంటే తాము కోరినట్లుగా యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్తులో మళ్ళీ దాడులు చేయబోమని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని షరతులు పెడుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన నూతన నాయకత్వం, ప్రజల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండటానికి ఈ కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ కూడా తన ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తోంది.

అనవసర యుద్ధం వైపు.

యుద్ధ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతానికి ఇరువర్గాలకు యుద్ధాన్ని పొడిగించాల్సిన అవసరం లేదు. కానీ, ఏ ఒక్కరు వెనక్కి తగ్గినా అది తమ ఓటమిగా మారుతుందనే భయం వారిని వెంటాడుతోంది. ఇరాన్ అంతర్గత తిరుగుబాట్లు , ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, బాహ్య శత్రువుపై పోరాటం ద్వారా ప్రజలను ఏకం చేయాలని చూస్తోంది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా కూడా తమ అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యుద్ధాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. త్రిముఖ ఘర్షణలో సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఈ అహంకార యుద్ధం ఇలాగే కొనసాగితే, అది కేవలం మధ్యప్రాచ్యానికే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా పెను ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.