Visakhapatnam CII Summit Over 13 lakh crore investments : విశాఖ సాగర తీరానికి పెట్టుబడుల సునామీ వచ్చింది. సీఐఐ భాగస్యామ్య సదస్సుకు అంచనాలకు మించిన స్థాయిలో పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. రెండు రోజుల పాటు జరిగే 30వ భాగస్వామ్య సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకోవాలని భావిస్తే... పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో మూజు రోజుల పాటు ఎంఓయూలు కుదుర్చుకోవాల్సి వచ్చింది. మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు కాగా వీటి ద్వారా 16,31,188 ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి.

అంచనాలకు మించి 30 శాతానికి మించి అదనంగా పెట్టుబడులు

కూటమి ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచే చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్... పారిశ్రామికాభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. ప్రతి 15 రోజులకోసారి కెబినెట్ సమావేశాలు పెట్టుకున్న తరహాలో ఎస్ఐపీబీ సమావేశాలు పెట్టుకుంది. వివిధ సంస్థలకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలో విశాఖ భాగస్వామ్య సదస్సు నాటికే సుమారుగా రూ. 10 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఏపీపై పారిశ్రామిక వర్గాల్లో నమ్మకం కలగడానికి ఇదే నిదర్శనం అని ప్రభుత్వం వివిధ సందర్భాల్లో చెబుతూనే ఉంది. దీన్ని మరింతగా కొనసాగించాలని... రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విశాఖ తీరాన భాగస్వామ్య సదస్సును చేపట్టాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో పర్యటించారు. అక్కడి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో భాగస్వామ్య సదస్సు నిర్వహించిన రెండు రోజుల్లో భారీగా పెట్టుబడులు వచ్చేలా ఉన్నాయని ప్రభుత్వం కూడా అంచనాతో ఉంది. అయితే మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ. 13 లక్షల కోట్లకు పైగా చేరడంతో అంచనాలను 100 శాతం చేరుకోవడంతోపాటు... అదనంగా మరో 30 శాతం మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా మార్గం సుగమం అయింది.

*ముఖ్యమంత్రి సమక్షంలోనే సగానికి పైగా పెట్టుబడులకు ఒప్పందాలు

మూడు రోజుల పాటు జరిగిన ఒప్పందాల్లో మొత్తంగా రూ. 13,25,716 కోట్ల ఒప్పందాలు జరిగితే... అందులో సగానికి పైగా ఒప్పందాలను ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగాయి. మూడు రోజుల పాటు చంద్రబాబు సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల విలువ రూ.7,63,210 పెట్టుబడులు. 123 ఎంఓయూల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయి. మూడు రోజుల పాటు జరిగిన ఎంఓయూల మేళాలో తొలి రోజున రూ. 3,65,304 కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. రెండో రోజున రూ. 3,49,476 కోట్లు... ఇక చివరి రోజున రూ.48,430 కోట్ల మేర ఎంఓయూలు కుదిరాయి. ఇక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భారీ ఎత్తునే పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా మంత్రులందరూ కలిసి 490 ఎంఓయూల ద్వారా రూ. 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు కుదుర్చుకున్నారు.

2 రంగాలు... రూ. 13 లక్షల కోట్లు

మూడు రోజుల పెట్టుబడులపై జరిగిన వరుస సమావేశాలు.. భేటీల్లో అటు ముఖ్యమంత్రి.. ఇటు మంత్రులంతా కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా 12 రంగాలకు పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడుల్లో టాప్-3లో ఇంధన రంగం, పరిశ్రమలు, మౌళిక వసతుల రంగాలు నిలిచాయి. మొత్తంగా రూ. 13.25 లక్షల కోట్ల మేర పెట్టుబడుల్లో అధిక భాగం ఇంధన రంగానికి వచ్చాయి. ఈ రంగంలో రూ. 5,33,351 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత పరిశ్రమల రంగానికి రూ. 2,80,384 కోట్లు, మౌళిక వసతుల రంగానికి రూ. 2,01,758 కోట్లు వచ్చాయి. ఇక ఉద్యోగాల కల్పనకు సంబంధించి టాప్-3లో పరిశ్రమలు, మౌళిక వసతులు. ఐటీఈ అండ్ సీ రంగాలున్నాయి.

భాగస్వామ్య సదస్సు మంచి విజయం సాధించిందన్న చంద్రబాబు

సీఐఐ సదస్సు కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు. మేధోపరమైన చర్చలకు, వినూత్న ఆవిష్కరణల్ని పంచుకునేందుకు కూడా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 500 మంది విద్యార్ధులను సెలెక్ట్ చేసి ఈ సీఐఐ సదస్సుకు ఆహ్వానించాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వారిని మార్చాలన్నదే మా ఉద్దేశం. ఆస్పిరెంట్ ఇండస్ట్రియలిస్ట్స్ గా వారిని మార్చే అవకాశం ఉంటుందన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి పరిశ్రమలకు కేటాయిస్తున్నాంమన్నారు. శ్రీసిటిలో 240 యూనిట్లు ప్రస్తుతం ఉన్నాయి. 50 దేశాలకు చెందిన కంపెనీలు తేవాలన్నది మా లక్ష్యమన్నారు. క్వాంటం కంప్యూటర్ల తయారికి కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు ఈ స్థాయిలో పెట్టుబడులు తీసుకువచ్చిన మంత్రులు, అధికారులను చంద్రబాబు అభినందించారు.