దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌‌ను విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో మొదలుపెట్టాడు. వన్డే కెరీర్ లో కోహ్లీకిది 52వ సెంచరీ. మ్యాచ్ తర్వాత, అతను టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి వస్తాడా? అని గత కొంతకాలం నుంచి అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాడు.

రాంచీలో జరిగిన తొలి వన్డేలో 135 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తర్వాత, కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌పై మాత్రమే దృష్టి పెడుతున్నానని స్పష్టం చేశాడు. "ఇది ఇలాగే ఉండబోతోంది, నేను ఒకే ఫార్మాట్ ఆడుతున్నాను" అని కోహ్లీ చేసిన ఈ ప్రకటన రన్ మేషిన్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటన్నది తేలిపోయింది.

తన వైఖరిని తెలిపిన కోహ్లీ

రాంచీలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు చేసి తన 52వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఇప్పటికీ వైట్ బాల్ కింగ్‌ తానేనని మరోసారి నిరూపించాడు. అతని ఇన్నింగ్స్ భారత్‌ను పటిష్ట స్థితికి వెళ్లడంతో పాటు ఉత్కంఠపోరులో విజయాన్ని అందించింది. మ్యాచ్ అనంతరం జరిగిన కార్యక్రమంలో టెస్ట్ క్రికెట్‌లోకి మళ్లీ వస్తారా అని ప్రశ్నించగా, కోహ్లీ ఏమాత్రం సంకోచించకుండా, ఇప్పుడు తన శరీరం, మనసు అవసరాలను అర్థం చేసుకున్నానని, ప్రస్తుతం ఒకటి కంటే ఎక్కువ ఫార్మాట్‌లు ఆడటం సాధ్యం కాదని స్పష్టం చేశాడు. టెస్టుల్లో కం బ్యాక్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశాడు.

తాజా నివేదికలకు చెక్

కొద్ది రోజుల క్రితం, BCCI కొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లను తిరిగి టెస్ట్ జట్టులోకి తిరిగి తీసుకురావాలని యోచిస్తోందని వార్తలు వచ్చాయి. ఇందులో కోహ్లీ, రోహిత్ పేర్లు ఉన్నాయి. 37 ఏళ్ల వయసులో కోహ్లీ మునుపటిలా అన్ని ఫార్మాట్లలో కొనసాగలేనని భావిస్తున్నాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు తాను పూర్తిగా విశ్రాంతి తీసుకున్నానని, తద్వారా ఎనర్జీ నిలుపుకున్నానని చెప్పాడు. తన మనస్సు చురుకుగా ఉన్నంత వరకు, శరీరం ఫిట్‌గా ఉన్నంత వరకు, ఆట మరింత సులభం అనిపిస్తుందని" కోహ్లీ పేర్కొన్నాడు.

'అనుభవమే అతిపెద్ద ఆయుధం'-కోహ్లీ

పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు ఈజీ అనిపించిందని, కానీ తర్వాత నెమ్మదించింది. అటువంటి పరిస్థితిలో, అవగాహన, షాట్ సెలక్షన్, అనుభవం చాలా ఉపయోగపడ్డాయి. ప్రాక్టీస్‌పై నమ్మకం ఉంచనని, తన మానసిక బలం, ఆటపై ఉన్న ఇష్టం, డెడికేషన్‌పై నమ్మకం ఉంచుతానని’ కోహ్లీ స్పష్టం చేశాడు. తాను కేవలం వన్డేలు మాత్రమే ఆడాలని భావిస్తున్నట్లు కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఒక్క ఫార్మాట్లోనే కొనసాగుతున్నట్లు ఇండైరెక్టుగా కోహ్లీ చెప్పకనే చెప్పేశాడు. దాంతో వన్డే వరల్డ్ కప్ వరకు కోహ్లీ ఆడతాడా అనే ఊహాగానాలకు చెక్ పెట్టాడు.

కోహ్లీ ఇదే ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తే ఈజీగా మరో మూడేళ్లు క్రికెట్ ఆటగలడు. అందులోనూ కేవలం ఒకే ఫార్మాట్లో ఆడుతున్నందున అంతగా ఒత్తిడి, అలసట సైతం అనిపించవు. మధ్యలో ఏడాదికి రెండు నెలలపాటు ఐపీఎల్ సీజన్ తో బిజీగా ఉంటాడు. కనుక వచ్చే వరల్డ్ కప్ కోహ్లీ లక్ష్యమని తేలిపోయింది. తొలి వన్డేలో రోహిత్ శర్మతో కలిసి 135 పరుగుల శతక భాగస్వామ్యం భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టింది. కోహ్లీ సెంచరీ అయితే మరో లెవల్ అనిపించింది.