Hyderabad News Updates | మెడలో హారం.. ఓ ప్లకార్డు వేలాడుతూ, చేతిలో జాతీయ జెండా పట్టుకుని,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్ కు చెందిన అమన్ అనే యువకుడు పాదయాత్రగా హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ యువకుడు ప్రముఖ రాజకీయ నాయకుడు, ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)ని స్వయంగా కలిసే గౌరవం పొందాలనేది అతని కల. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అమన్ అనే ఈ యువకుడు ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ నుండి సెప్టెంబర్ 12న పాదయాత్రగా బయలుదేరాడు.

మజ్లిస్ అధినేతపై అభిమానం చాటుకుంటున్న యువకుడు

శనివారం తెలంగాణలోని ఆదిలాబాద్ మీదుగా కాలినడకనగా ప్రయాణించి నిర్మల్ జిల్లాకు చేరుకున్నాడు. ఆదిలాబాద్ లో, మజ్లిస్ టౌన్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, తన పార్టీ కార్యకర్తలతో కలిసి, అమన్ కు హృదయపూర్వకంగా స్వాగతం పలికి, పార్టీ కార్యాలయంలో ఉత్సాహభరితమైన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, నజీర్ అహ్మద్, అతుల్ తల్వార్, ఇనాయత్ చిష్టి, రోహిత్, జకరియా, బాబు షా, రెహ్మత్, తదితరులు అమన్ కు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. నిర్మల్ జిల్లాకు చేరుకున్న వెంటనే, abp దేశం అమన్ ను సంప్రదించి విషయాలు అడిగింది.

సెప్టెంబర్ 12న పాదయాత్ర ప్రారంభం..

ఈ సందర్భంగా abp దేశం అమన్ తో మాట్లాడగా అమన్ మాట్లాడుతూ... హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పట్ల తనకు అపార ప్రేమ ఉందని, దళితులు, వెనుకబడిన తరగతులు, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి నిర్భయంగా నాయకత్వం వహిస్తున్నారని కొనియాడాడు. అందుకే ఆయనను వ్యక్తిగతంగా కలవడానికి సెప్టెంబర్ 12న పాదయాత్రగా బయలుదేరాననీ, గత 27 రోజులుగా పాదయాత్రగా నడుస్తున్నానని అమన్ చెప్పాడు. శనివారం నిర్మల్ జిల్లాకు చేరుకొవడం జరిగిందని, సాయంత్రం వరకు నిజామాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టారు. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్ చేరుకునీ అక్కడ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీనీ కలిసిన తర్వాత తన పాదయాత్రను ముగిస్తానన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ నీ కలవాలనేది తన ఏకైక కోరిక అనీ, అందుకే తాను ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ నుండి తెలంగాణలోని హైదరాబాద్ వరకు ఈ పాదయాత్రను విభిన్న రూపాల్లో మనస్ఫూర్తిగా చేస్తున్నానన్నారు. తాను పాదయాత్రగా వస్తున్న క్రమంలో దారిలో పలువురు తనను ఆదరించి భోజన వసతి సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపాడు. తనను ఆదరిస్తూ అభిమానంతో సౌకర్యాలు కల్పిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.