Cases Against YSRCP Leaders | విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు సోమవారం నిర్వహించిన ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మెగా డీఎస్సీ (Mega DSC)2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. నిరసన పేరుతో వైసీపీ శ్రేణులు, పలువురు రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు శాప్ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై శాప్‌ డైరెక్టర్‌ సంతోశ్‌ ఫిర్యాదు చేయగా మాచవరం పోలీసులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మచిలీపట్నం ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్‌తో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలపై బిఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. బీఎన్ఎస్ లోని 221,223,127,132,189 109(1) సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(2) (v) కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శాప్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసనకారులు తమతో పాటు రాళ్లు, కర్రలు, కోడిగుడ్లు, టమాటాలు అట్టపెట్టెల్లో తెచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. గతంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు, సీఎం చంద్రబాబు నివాసంపై దాడుల కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీషీటర్లు పానుగంటి చైతన్య, శృంగారపాటి సందీప్ వంటి వారిని వెంటబెట్టుకుని వచ్చి అరాచకం సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులపై రాళ్లు, నీళ్ల సీసాలు, చెప్పులు విసురుతూ తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. టీచర్లకు రక్షణగా నిలిచిన వాలంటీర్లపై కర్రలతో దాడి చేయడంతో రామకృష్ణ, నితిన్‌రెడ్డి అనే వాలంటీర్ల తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయి.

3 గంటలపాటు రచ్చ రచ్చ
ఈ ముట్టడి సమయంలో వైసీపీ శ్రేణులు మీసాలు మెలేస్తూ, తొడలు కొడుతూ, విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేస్తూ తీవ్రంగా ప్రవర్తించారు. 2029లో చూసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ రచ్చతో విజయవాడలోని ప్రధాన రహదారి ఎంజీ రోడ్డులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు, ప్రయాణికులు బాగా ఇబ్బంది పడ్డారు. శాప్ కార్యాలయం లోపల విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా కుట్ర పన్ని ఈ దాడులు చేశారని పోలీసులు స్పష్టం చేశారు. కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం.

మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై జరుగుతున్న నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని, క్రీడల శాఖ మంత్రి, శాప్ ఎండీలకు వినతిపత్రం ఇచ్చేందుకు టీచర్లు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో, మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ నేతలు జోగి రమేష్, దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా, మేరుగు నాగార్జున తదితరులు పోలీసు అనుమతి లేకుండా ధర్నాకు దిగారు.

వైసీపీ నేతల నిరాధార ఆరోపణలను ఉపాధ్యాయులు ప్రశ్నించగా, వారిపై కర్రలతో దాడులకు తెగబడ్డారు. అడ్డుకోబోయిన పోలీసులను సైతం తోసివేస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆందోళనకారులను తరలించేందుకు పోలీసులు స్కూల్ బస్సులు తీసుకురాగా, దేవినేని అవినాష్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా వంటి నేతలు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేస్తూ పార్టీ కార్యకర్తలను మరింత రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.