<p>హైదరాబాద్‌: దసరా సెలవుల అనంతరం ప్రజలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దాంతో వరుసగా రెండోరోజు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో జర్నీ టైం కంటే, ట్రాఫిక్ లో వేచి చూసే సమయమే ఎక్కువ అవుతోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి వరకు భారీ రద్దీ ఏర్పడింది. సోమవారం ఉదయం సైతం హైదరాబాద్‌కు వచ్చే ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ జామ్ సమస్య తప్పడం లేదు.</p>
<p>నల్గొండ జిల్లాలో చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు 4 కిలోమీటర్ల వేర వాహనాలు నిలిచిపోయాయి. వంతెన నిర్మాణ పనుల వల్లఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద, దండు మల్కాపురం, చౌటుప్పల్ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ చింతలకుంట నుంచి దిల్‌సుఖ్ నగర్ వెళ్లే మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ ఏర్పడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కిలోమీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయాయి.</p>
<p>హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం నుంచే ట్రాఫిక్‌ క్రమంగా పెరుగుతోంది. పండుకు సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి తమ వ్యక్తిగత వాహనాలలో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కావడంతో రోడ్లపై ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ వైపున 9 టోల్ బూత్‌లను ప్రారంభించి వాహనాలను వేగంగా పంపుతూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. </p>