Vijay Silence: రాజకీయాల్లో మాట చాలా పదునైంది. అయితే మౌనం అంతకంటే శక్తివంతమైందని విజయ్ నిరూపిస్తున్నాడా..? ఎందుకంటే తమిళనాడులోని రాజకీయ పరిణామాలపై దేశమంతా తనవైపు చూస్తున్నా.. ఆయన మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. తమిళనాడులో మూడు నాలుగురోజులుగా హై లెవల్ పొలిటికల్ డ్రామా నడుస్తోంది. గవర్నర్ నిర్ణయాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా చర్చ నడుస్తోంది. మీడియా విజయ్ ఏం మాట్లాడతాడా అని చాలా ఆసక్తిగా ఎదురుచూసింది. కానీ ఈ పొలిటికల్ బజ్‌కు కారణమైన కీ పర్సన్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే గవర్నర్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చాలా చర్చ నడిచింది. సోషల్ మీడియా చాలా హోరెత్తింది. రెండు సార్లు గవర్నర్‌ను కలిసినా ఆహ్వానం రాకపోవడం... మెజార్టీ ఉంటేనే రమ్మనడం వంటివి చర్చకు దారితీశాయి. బలాన్ని నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో కానీ.. లోక్‌భవన్‌లో కాదు అనే వాదన వచ్చింది. ఈ సందర్భంగా కూడా విజయ్ మాట్లాడలేదు. చివరకు ఇతర పార్టీల మద్దతు తర్వాత మూడోసారి గవర్నర్‌ను కలిసి తనకు సంఖ్యాబలం ఉందని.. సంతకాలు కాపీలను అందించి వెళ్లిప్పుడు కూడా మాట్లాడలేదు. అలాగే తనకు మద్దతు ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీని కూడా బహిరంగంగా కోరలేదు.

రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ ఇంతే

రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత కూడా విజయ్ ఎప్పుడూ మీడియా ముందు స్టేట్‌మెంట్‌లు ఇవ్వలేదు. కరూర్ వంటి ఘటనలు జరిగినప్పుడు .. వీడియో రిలీజ్‌ తప్ప.. ఓ పొలిటికల్ స్టేట్‌మెంట్, కామెంట్ ఎప్పుడూ కూడా చేయలేదు. ఏం చేసినా ప్రజల ముందటే అన్నట్లుగా వ్యవహరించారు. ఆయనెప్పుడూ పబ్లిక్‌ మీటింగ్‌లోనే మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో కూడా సభల్లో మాత్రమే మాట్లాడారు. విజయ్ గెలిచిన తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా శుభాకాంక్షలు తెలిపారు.కానీ ఆయన మాత్రం కేవలం ప్రధాని మోదీకి, రాహుల్‌గాంధీకి మాత్రమే సమాధానం ఇచ్చారు. ప్రధానికి ప్రోటోకాల్‌ను గౌరవించి.. రాహుల్‌గాంధీకి మద్దతు అవసరం అయ్యి .. రెస్పాండ్ అయినట్లు కనిపించింది.

ముఖ్యమంత్రిగానే మాట్లాడతారా..?

ఏదైనా సరే ముఖ్యమంత్రిగానే మాట్లాడదామని విజయ్ నిర్ణయించుకున్నారా అనిపిస్తోంది. ప్రమాణస్వీకారం తర్వాత ముఖ్యమంత్రిగానే ప్రజలతోనూ.. ప్రెస్‌తోనూ మాట్లాడతారేమో.. తాను సీఎంగా సెక్రటేరియెట్‌ నుంచే మీడియాను అడ్రెస్ చేయాలనుకుంటున్నారేమో అనిపిస్తోంది."ఆయన మాట్లాడటం మొదలుపెడితే అది నేరుగా ప్రజల గుండెల్లోకి వెళ్లాలి, అది కూడా నిర్ణయాత్మకమైన స్థానంలో ఉన్నప్పుడే జరగాలి అనేది ఆయన టీమ్ వ్యూహంగా కనిపిస్తోంది.