Vijay CM Swearing-in Ceremony Delayed: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగాయి. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీకి స్వల్ప దూరంలో నిలిచింది. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను కలిసిన విజయ్‌, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, తగిన సంఖ్యాబలంపై గవర్నర్‌ సంతృప్తి చెందకపోవడంతో గురువారం జరగాల్సిన ప్రమాణస్వీకారం నిలిచిపోయినట్టు తెలుస్తోంది.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం స్థానాలపరంగా మెజారిటీ మార్కు 118 ఉంది. గవర్నర్‌కు విజయ్‌ సమర్పించిన జాబితాలో కేవలం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కనిపిస్తోంది. దీనికి కారణం విజయ్ తన పార్టీ తరఫున 107 మంది ఎమ్మెల్యేల మద్దతును కలిగి ఉన్నారు. వాస్తవానికి ఆయన రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించడంతో పార్టీ ప్రభావంతమైన సంఖ్యాబలం 107ా ఉంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పటికే టీవీకేకి అధికారికంగా మద్దతు ప్రకటించింది. తమ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు లేఖలను విజయ్‌కు అందించారు. ఈ రెండు కలిపితే 112 అవుతుండగా, మ్యాజిక్ ఫిగర్‌ 118ని చేరుకోవడానికి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు అత్యవసరం.

Also Read:  టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు.. 2 మంత్రి పదవులకు విజయ్‌తో డీల్!

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చల సందర్భంగా గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ రాజ్యాంగబద్ధమైన నిబంధనలను గుర్తు చేశారు. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసమరైన 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్ధతు లేఖలు ఉంటేనే తదుపరి చర్యలు తీసుకోవడం సమంజసమని ఆయన విజయ్‌కు సూచించారు. దీంతో మిగిలిన మద్దతును కూడట్టుకోవడానికి విజయ్ గవర్నర్‌ను మరికొంత సమయం కోరారు.

Also Read: TVK విజయ్ కి శని వదిలింది, విజయం వరించింది, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నుంచి రాజయోగమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పార్టీలు, స్వతంత్రుల నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. విజయ్‌ ఇప్పటికే వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న విదుతలై చిరుతైగల్ కట్జి తమ నిర్ణయాన్ని గురువారం వెల్లడిస్తామని తెలిపింది. నలుగురు ఎమ్మెల్యేల బలం ఉన్న లెఫ్ట్ ఫ్రంట్‌ పార్టీలు మే 8 నాటికి తమ తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. పట్టాలి మక్కల్ కట్చికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు విజయ్‌ను కలిసిప్పటికీ, ఇప్పటి వరకు వారు అధికారికంగా మద్దతు లేఖను అందజేయలేదు. మరో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే మాత్రం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

విజయ్ వెంట పార్టీ సీనియర్ నేతలు బుస్సి ఎన్ ఆనంద్, అదవ్, అర్జున కేఏ సెంగోట్టయన్, సీటీ నిర్మల్‌ కుమార్ వంటి వారు ఉన్నప్పటికీ సంఖ్యాబం సమకూర్చుకోవడం ఇప్పుడు సవాలుగా మారింది. మే 7న జరగాల్సిన ప్రమాణస్వీకారం వాయిదా పడటంతో అటు అభిమానుల్లో, ఇటు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలలో విజయ్‌ను గౌరనీయ తమిళనాడు ముఖ్యమంత్రి గా పేర్కొంటూ జన నాయకన్ అనే టైటిల్ కార్డ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

తమిళనాడు రాజకీయ చరిత్రలో సినిమా రంగం నుంచి వచ్చిన నేతలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. విజయ్‌ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి ఎన్నికల్లోనే అతి పెద్ద పార్టీగా అవతరించడం గొప్ప విషయం. కానీ రాజ్యాంగపరమైన సంఖ్యాబలం నిరూపించుకోవడంలో తలెత్తిన ఈ అడ్డంకిని ఆయన ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గవర్నర్ ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉండటంతో రాబోయే 24 నుంచి 48 గంటలు రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలకం కానున్నాయి.