Expert-Recommended Vaginal Care Tips : మహిళల ఆరోగ్యంలో యోని (Vagina) కీలకమైన పాత్ర పోషిస్తుంది. అయితే దీని గురించి మాట్లాడేందుకు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. యోని దగ్గర సమస్య ఉన్నా.. ఏదైనా ఇబ్బంది ఉన్నా.. లోలోపలే దాచుకుని సమస్యను పెద్దది చేసుకుంటారు. కానీ మీకు తెలుసా? సరైన పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనశైలి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల యోనికి సంబంధించిన అనేక ఇన్ఫెక్షన్లు, అసౌకర్యాలను నివారించవచ్చట. మరి యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన విషయాలు ఏంటో చూసేద్దాం.

యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుందా?

యోని సహజంగానే తనను తాను శుభ్రం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రత్యేకంగా యాంటీసెప్టిక్ ద్రావణాలు, ఘాటైన సబ్బులు లేదా డౌచింగ్ వంటి పద్ధతులు అవసరం లేదని అంటున్నారు. గోరువెచ్చని నీటితో బయటి భాగాన్ని శుభ్రం చేస్తే సరిపోతుంది. ఎక్కువగా క్లీనింగ్ ఉత్పత్తులు వాడటం వల్ల యోనిలోని సహజ pH సమతుల్యత దెబ్బతిని ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు.

డిశ్చార్జ్ సమస్య?

చాలామంది మహిళలు యోని నుంచి డిశ్చార్జ్ కనిపించగానే భయపడుతుంటారు. కానీ పారదర్శకంగా లేదా పాలరంగులో ఉండే డిశ్చార్జ్ అనేది సాధారణమే. ఇది యోనిని ఆరోగ్యంగా ఉంచే సహజ ప్రక్రియలో భాగం. అయితే డిశ్చార్జ్ పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారడం, దుర్వాసన రావడం, నొప్పి లేదా దురద వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

లోదుస్తుల ఎంపిక

సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో తయారైన లోదుస్తులు తేమను బంధించి ఇన్ఫెక్షన్లు పెంచుతాయి. కాబట్టి కాటన్ లోదుస్తులు ఉపయోగించాలి. ఇవి గాలి ప్రసరణకు సహాయపడటంతో పాటు ఆ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి. దీంతో బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.

టాయిలెట్ తర్వాత శుభ్రత

చాలామందికి తెలిసిన విషయమే అయినప్పటికీ.. టాయిలెట్ తర్వాత సరైన విధానాన్ని పాటించకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి టాయిలెట్ ఉపయోగించిన తర్వాత ఎప్పుడూ ముందు నుంచి వెనుకకు తుడవాలని గుర్తించుకోండి. ఇలా చేయడం వల్ల మలద్వారం దగ్గర ఉండే బ్యాక్టీరియా యోనిలోకి చేరకుండా నివారించవచ్చు.

సురక్షిత లైంగిక సంబంధాలు

కండోమ్ వాడటం కేవలం గర్భధారణ నివారణకే కాదు. ఇది లైంగికంగా వ్యాపించే ఇన్ఫెక్షన్ల (STIs) ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. స్థిరమైన సంబంధంలో ఉన్నప్పటికీ.. సురక్షిత లైంగిక అలవాట్లు పాటించడం మహిళల ఆరోగ్యానికి ఎంతో అవసరం.

హెల్త్ టెస్ట్..

యోని ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపించవు. అందుకే పెల్విక్ ఎగ్జామినేషన్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గర్భాశయ ముఖద్వారానికి సంబంధించిన మార్పులు లేదా ఇతర సమస్యలను ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.

ఆహారం, నీటి విషయంలో నిర్లక్ష్యం

శరీరంలోని ప్రతి భాగం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత నీరు తాగడం, ఆకుకూరలు, పండ్లు, నట్స్, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలను తీసుకోవడం వల్ల యోని ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. శరీరంలో తేమ, పోషకాల సమతుల్యత ఉండటం ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.

సువాసన తెప్పించే ప్రొడెక్ట్స్

సువాసన కలిగిన ఫెమినిన్ వాష్‌లు, ప్యాడ్లు లేదా ఇతర ఉత్పత్తులు ఆ ప్రాంతంలోని సున్నితమైన చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. అంతేకాకుండా యోనిలోని సహజ pH స్థాయిలను కూడా దెబ్బతీయవచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు సువాసన లేని ప్రొడెక్ట్స్ ఎంచుకోవడం మంచిది.

అసౌకర్యాన్ని లైట్ తీసుకోకండి..

మీకు యోని దగ్గర దురద, మంట, నొప్పి లేదా అసాధారణమైన అనుభూతులు ఉంటే వాటిని సాధారణ సమస్యగా తీసుకోవద్దు. ఇవి ఈస్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లేదా బ్యాక్టీరియల్ వెజినోసిస్ వంటి సమస్యలకు సంకేతాలు కావచ్చు. లక్షణాలు కొనసాగితే వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం.

పీరియడ్స్ ట్రాక్ చేయండి..

ప్రతి మహిళ తన రుతుచక్రాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. నెలసరి తేదీలు, రక్తస్రావంలో మార్పులు, స్పాటింగ్ లేదా ఇతర అసాధారణ లక్షణాలను గుర్తించడం ద్వారా ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంచడంలో కూడా సహాయపడుతుంది.

కాబట్టి యోని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖరీదైన ఉత్పత్తులు లేదా క్లిష్టమైన పద్ధతులు అవసరం లేదు. సరైన పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షిత అలవాట్లు, ఆరోగ్య పరీక్షలు చాలావరకు సరిపోతాయి. కాబట్టి ఈ చిన్ని జాగ్రత్తలను విస్మరించవద్దు. ఎందుకంటే ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తాయి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.