పాట్నా: హర్మూజ్ జలసంధిని తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన అల్టిమేటంపై ఇరాన్ నుండి గట్టి ప్రతిస్పందన వచ్చింది. భారత్‌లో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించి ట్రంప్ పెద్ద తప్పు చేశారని, దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ట్రంప్ హెచ్చరికలపై బిహార్ రాజధాని పాట్నాలో ఇలాహి స్పందించారు. ఇలాంటి ప్రకటనలు కొత్తేమీ కాదని, దశాబ్దాలుగా ఇరాన్‌కు వస్తున్న హెచ్చరికలేనని పేర్కొన్నారు. అల్టిమేటం జారీ చేయడం, హెచ్చరికలు మాకు కొత్త విషయం కాదు. గత 47 ఏళ్లుగా హెచ్చరిస్తున్నప్పటికీ అమెరికా మమ్మల్ని ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కూడా ఏమీ చేయలేరని అని వార్తా సంస్థ ANIతో అన్నారు.

ట్రంప్ వాదనను తోసిపుచ్చిన ఇలాహి
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా గెలిచిందన్న ట్రంప్ వాదనను ఇలాహి తోసిపుచ్చారు. మేం అమెరికాకు యుద్ధ భూమిలో, గగనతలంలోనూ సమాధానం చెప్పగలం. వారు 3 రోజుల్లోనే మమ్మల్ని ఏదో చేయాలనుకున్నారు. కానీ నేటికి ఐదు వారాలు గడిచిన మాట వాస్తవం కాదా అన్నారు.

భారత విదేశీ విధానంపై ఇరాన్ ప్రతినిధి ప్రశంసలు
అమెరికాను తీరును ఎండగట్టిన ఇరాన్ ప్రతినిధి ఇలాహి ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. మనం శాంతి గురించి మాట్లాడితే మంచిది. ప్రపంచం మొత్తం శాంతిని నెలకొల్పాలి. ఈ భారత దౌత్య విధానం అత్యుత్తమం. ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. మొదట్నుంచీ అమెరికా తప్పు చేస్తోంది. ఇది కేవలం ఇరాన్‌పై యుద్ధం మాత్రమే కాదు, మానవాళికి, మొత్తం ప్రపంచానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని చెప్పవచ్చు. ఈ యుద్ధం వల్ల పలు దేశాల్లోని కోట్లాది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇలాహి గుర్తుచేశారు.

#WATCH | Patna, Bihar | On US President Donald Trump issuing a threat against Iran, Dr Abdul Majid Hakeem Ilahi, representative of Iran’s Supreme Leader in India, says, "It is not anything new... They couldn't do anything to us for 47 years. They can't do anything else."

On… https://t.co/s7JoN3mK1Y pic.twitter.com/RT4rq1nY2B

— ANI (@ANI) April 5, 2026

ట్రంప్ భాష ఆయన గురించి చెబుతుంది..
ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే వారి మాటలు, భాషను చూస్తే అర్థం చేసుకోవచ్చు అని, వారి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని ఇలాహి అన్నారు. ఒకరు ఉపయోగించే భాష వారి వ్యక్తిత్వం, మానవత్వంతో పాటు నైతికతను వ్యక్తం చేస్తుంది. అసభ్యకరమైన భాషను ఉపయోగించే వ్యక్తి వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. చాలా మంది అమెరికా సెనేటర్లు కూడా అలాంటి భాషను ఉపయోగించలేదని ట్రంప్ ను ఎద్దేవా చేశారు.

ప్రపంచ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి ఏంటంటే..
‘అమెరికా, ఇజాయెల్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపడంలో అన్ని దేశాలు తమ వంతు పాత్ర పోషించవచ్చు. ఈ యుద్ధం పలు దేశాల్లోని కోట్లాది మందిని చాలా రకాలుగా ప్రభావితం చేస్తోంది. ఓవైపు ముడి చమురు ధరలు పెరిగాయి. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు పలు దేశాల్లో పెరగడంతో సరకు రవాణా ఖర్చులు ఎగబాకాయి. మీడియాతో పాటు పలు దేశాల ప్రపంచ నాయకులు కలిసి సమష్టిగా ప్రయత్నాలు చేసి ఈ యుద్ధాన్ని ఆపాలని డొనాల్డ్ ట్రంప్‌ను కోరడం చాలా ముఖ్యం, అందరికీ ఇదే మంచిదని’ ఇరాన్ ప్రతినిధి ఇలాహి విజ్ఞప్తి చేశారు.