US Iran Tension: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తున్నామని, ఈ ప్రతిపాదనను ఆమోదించడం కష్టమేనని, చాలా అనుమానాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శనివారం తెలిపారు. ఇరాన్ గతంలో చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించుకోలేదని ట్రంప్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను మధ్యవర్తిగా చేసుకుని ఇరాన్ 14 పాయింట్ల ప్రతిపాదనను అమెరికాకు పంపింది.

ఇరాన్ ప్రతిపాదనను ఆమోదించడం కష్టం
డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ఇరాన్ మాకు పంపిన ప్రతిపాదనను త్వరలోనే సమీక్షిస్తాను. కానీ అది ఆమోదయోగ్యంగా ఉంటుందని అనుకోవడం లేదు. గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి ఆ దేశం చేసిన నష్టానికి గానూ ఇప్పటివరకు భారీ మూల్యం చెల్లించుకోలేదు’ అని పేర్కొన్నారు.

జర్నలిస్టులతో ట్రంప్ ఏమన్నారు..
తాను ఇంకా ఇరాన్ 14 పాయింట్ల ప్రతిపాదనను పూర్తిగా చూడలేదని జర్నలిస్టులతో మాట్లాడుతూ ట్రంప్ తెలిపారు. తాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏం చేస్తామో మీకు చెబుతానని అన్నారు. పిచ్చి వాళ్ల చేతికి అణ్వాయుధాలు వెళితే ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందన్నారు.

ఇరాన్ ప్రతిపాదనలో ఏముంది?

ఇరాన్‌కు చెందిన తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. లెబనాన్‌ ఉద్రిక్తతలతో సహా అన్ని రంగాలలో యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ 14 అంశాల ప్రతిపాదనతో కూడిన ఒక సమగ్ర ప్రణాళికను పాక్ ద్వారా అమెరికాకు అందించింది. ఈ ప్రతిపాదనలో తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరిస్తూనే, 30 రోజుల్లోగా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని పేర్కొంది.

రక్షణ, సైనిక డిమాండ్లు
భవిష్యత్తులో తమ దేశంపై దాడులను నిరోధించడానికి భద్రతా హామీలు, ఇరాన్ నుండి అమెరికా దళాల ఉపసంహరణ, హర్మూజ్ లో నేవీ ఆంక్షలు, దిగ్బంధనాలను ఎత్తివేయాలని తన ప్రతిపాదనలో డిమాండ్ చేసింది. ఫ్రీజ్ చేసిన తమ నిధులను విడుదల చేయాలని, అలాగే ఆంక్షలు, సైనిక ఒత్తిడి కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని అమెరికాను ఇరాన్ కోరింది.

ఇరాన్ ఆర్థిక, వ్యూహాత్మక షరతులు
ఆర్థిక పరంగా అమెరికా అంతర్జాతీయ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీంతో పాటు వాణిజ్యం సజావుగా సాగేలా హర్మూజ్ జలసంధి కోసం ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ద్వారా పంపినట్లు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ గరీబాబాదీ తెలిపారు. తమపై బలవంతంగా రుద్దిన యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని.. ఇక దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా లేదా యుద్ధాన్నే ఎంచుకోవాలా అనేది అమెరికానే డిసైడ్ చేసుకోవాలని ఇరాన్ సూచించింది.

కఠినంగా వ్యవహరించిన ట్రంప్, సైనిక చర్యకు సైతం రెడీ
ఇరాన్ చర్చలకు దిగొచ్చి అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని అనుకుంటోందని, అయితే అక్కడి లీడర్‌షిప్ వ్యవస్థ చిన్నాభిన్నమైందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చర్చలకు రాకపోయినా, ఒప్పందం చేసుకోకపోయినా, అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని సైతం హెచ్చరించారు. ఇరాన్ ప్రవర్తన, నిర్ణయాలపై ఆధారపడి తన చర్యలు ఉంటాయన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం, అణ్వాయుధ సామర్థ్యాన్ని లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు వస్తే కనుక ప్రపంచం మొత్తం వారి చేతిలో బందీ అవుతుందని ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా ఎలాంటి తొందరపాటు ఒప్పందాలు చేసుకోదని ట్రంప్ పేర్కొన్నారు. 2 లేదా 5 ఏళ్ల తర్వాత మళ్లీ పరిస్థితులు దిగజారకుండా ఉండేలా, దీర్ఘకాలిక స్థిరత్వం కోసం ఏదైనా డీల్ చేసుకోవాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.