US Divorce Decree: అమెరికా న్యాయస్థానాలు ఇచ్చిన విడాకుల తీర్పులు భారతదేశంలో చెల్లుబాటు కావని దిల్లీలోని సాకేత్ ఫ్యామిలీ కోర్టు ఒక కీలక తీర్పులో స్పష్టం చేసింది. విదేశీ కోర్టులో భారతీయ లైఫ్ పార్టనర్‌కి తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఇచ్చే విడాకుల ఉత్తర్వులు, భారత కోర్టుల ప్రకారం అమలు చేసేలా పరిగణించలేమని కోర్టు తేల్చి చెప్పింది.

కేసు వివరాలు

2015 డిసెంబర్ 20న సాకేత్‌లోని ఆర్య సమాజ్ ఆలయంలో ఈ జంటకు వివాహం జరిగింది. అనంతరం ఈ పెళ్లిని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి కలహాలు ప్రారంభమయ్యాయి. భార్య అమెరికా వెళ్లి మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ కౌంటీ ఫ్యామిలీ కోర్టులో విడాకులు, పిల్లల సంరక్షణ, భరణం కోసం పిటిషన్ దాఖలు చేసింది. భర్త గైర్హాజరులో యూఎస్ కోర్టు ఏకపక్షంగా విడాకులు మంజూరు చేసింది. అయితే, యూఎస్ కోర్టు తీర్పు ఇవ్వకముందే భర్త భారతదేశంలో వైవాహిక హక్కుల పునరుద్ధరణ కోసం సాకేత్ కోర్టును ఆశ్రయించాడు.

సాకేత్ కోర్టు తెలిపిన కీలక అంశాలు

అమెరికా కోర్టులో భర్తకు తన వాదనను వినిపించుకునే సరైన అవకాశం లభించలేదు. ఏకపక్షంగా ఇచ్చిన ఈ తీర్పు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సాకేత్ ఫ్యామిలీ కోర్టు జడ్జి పూర్వ సరిన్ స్పష్టం చేశారు. అమెరికా కోర్టు జారీ చేసిన విడాకులు భారతీయ హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లవని తెలిపింది. భారత్ చట్టాల ప్రకారం క్రూరత్వం, వ్యభిచారం, విడిచిపెట్టడం లేదా పరస్పర అంగీకారం వంటి కారణాలను మాత్రమే విడాకులకు కారణాలుగా గుర్తిస్తారు.

సుప్రీంకోర్టుకు మాత్రమే ప్రత్యేక అధికారం

"వివాహం కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైంది" అనే ప్రాతిపదికన విడాకులు ఇచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. దిగువ కోర్టులు లేదా విదేశీ కోర్టులు ఈ కారణంతో ఇచ్చిన తీర్పులను భారత చట్టాలు అంగీకరించవు.

సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్లు 13 & 14

భారతదేశంలో విదేశీ కోర్టు తీర్పులు చెల్లుబాటు కావాలంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ (CPC) సెక్షన్ 13, 14లలో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉండాలి. కేసు పూర్తి విచారణ జరగకుండా, భాదితుడికి అవకాశం ఇవ్వకుండా ఇచ్చే ఉత్తర్వులు సెక్షన్ 13 మినహాయింపుల పరిధిలోకి వస్తాయి.

Also Read: మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే

కోర్టు తీర్పు

అమెరికా కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పు భారత్ లో అమలుకాదని సాకేత్ కోర్టు స్పష్టం చేసింది. భర్తకు భారతీయ చట్టాల ప్రకారం వైవాహిక హక్కుల పునరుద్ధరణ కోసం లేగా ఇతర చట్టబద్ధమైన ఉపశమనం కోసం కేసును కొనసాగించే స్వేచ్ఛను కల్పించింది. కేవలం విదేశీ కోర్టు ఇచ్చిందనే ఒకే ఒక్క కారణంతో ఆ తీర్పును కోర్టులు అంగీకరించబోవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read: విజయ్‌ను నడిపిస్తోంది ముగ్గురు తెలుగు స్నేహితులేనా? - ఆ రెడ్డి బ్రదర్స్‌ను డీఎంకే ఎందుకు టార్గెట్ చేస్తోంది?