TVK Vijay Give Up Trichy: తమిళనాడు ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన టీవీకే అధినేత విజయ్‌ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోయినప్పటికీ కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయనున్నారు. తమిళనాడులో 108 స్థానాల్లో విజయం సాధించగా అందులో రెండు స్థానాలు విజయ్‌వే. ఇందులో ఇప్పుడు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. 14 రోజుల్లోనే ఈ నిర్ణయాన్ని ప్రకటించాలి. ఇప్పుడు ఏ నియోజకవర్గాన్ని ఉంచుకొని ఏ స్థానాన్ని వదులుకుంటారో అన్న ఉత్కంఠ మాత్రం ప్రజల్లో మొదలైంది.

రెండు చోట్ల భారీ మెజారిటీ

దళపతి విజయ్‌ తిరుచ్చి ఈస్ట్‌, పెరబూర్‌ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పెరంబూర్‌లో డీఎంకే అభ్యర్థి ఆర్డీ శేఖర్‌పై 53,715 ఓట్ల తేడాతో గెలుపొందారు. తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గంలో కూడా డీఎంకేకు చెందిన ఇనిగో ఇరుదయరాజ్‌ను ఓడించారు. ఇక్కడ కూడా విజయ్‌కు 27,416 ఓట్ల మెజారిటీ వచ్చింది. రెండు చోట్ల కూడా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఇప్పుడు ఏ సీటును త్యాగం చేస్తారనే అంశంపై చర్చ నడుస్తోంది. రెండు చోట్ల కూడా హేమాహేమీలను పడగొట్టిన విజయ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న డైలమాలో ఉన్నారు. ఇదే అంశంపై పార్టీ నేతలు స్థానిక నాయకత్వంతో విజయ్ చర్చలు జరుపుతున్నారు.

తిరుచ్చి ఈస్ట్‌కు రాజీనామా చేయనున్న విజయ్

1951 సెక్షన్ 70 ప్రకారం ఒక అభ్యర్థి రెండు సీట్లలో పోటీ చేస్తే కచ్చితంగా ఒక సీటును వదులుకోవాల్సి ఉంటుంది. ఇది 14 రోజుల్లో పూర్తి చేసి ఎన్నికల సంఘానికి సమాచారం అందివ్వాలి. దీంతో అక్కడ ఆరు నెలలలోపు అధికారులు ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడు పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాలను పరిశీలిస్తే విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.

తిరుచ్చి ఈస్ట్ నుంచి టఫ్‌ ఆఫీసర్

పెరంబూర్ చెన్నైకి దగ్గరగా ఉండటం, అక్కడ పార్టీకి మంచి గట్టి కేడర్ ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పుడు తన స్థానంలో గట్టి వ్యక్తి ప్రజలకు మేలు చేసే వ్యక్తిని నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకే అక్కడ మాజీ ఐఏఎస్‌ అధికారి యు. సగయంను బరిలోకి దించుతారని పార్టీ వర్గాల్లో జోరుగా డిస్కషన్ జరుగుతోంది. విజయ్ రాజీనామా చేసిన స్థానంలో త్రిషకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని ఇప్పుడు ఐఏఎస్ అధికారి పేరు తెరపైకి వచ్చింది.

Also Read: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు.. 2 మంత్రి పదవులకు విజయ్‌తో డీల్!

పెరంబూర్‌లో ఉండటానికి రీజన్ ఇదే

దశాబ్దాలుగా ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులు గెలిచినప్పటికీ కొన్ని మౌలిక వసతులు కల్పించలేకపోయారనే విమర్శ ఉంది. అందుకే అక్కడి ప్రజలు విజయ్‌ను ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారు. ఇక్కడ పేద ప్రజలు, కార్మికులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ సామాజిక దురాచారాలు, మాదక ద్రవ్యాలు ప్రభావం చాలా ఉందని తెలుస్తోంది. వాటన్నింటి లేకుండా చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి అక్కడ ప్రజల మనసులు గెలుచుకున్న విజయ్ దాన్నే తన శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవచ్చనే మాట వినిపిస్తోంది.