చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమవుతోంది. అయితే జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (TVK)108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్ ఇదివరకే కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. రాహుల్ గాంధీకి మద్దతు కోసం రిక్వెస్ట్ పంపగా, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనున్నారు.

మరికొన్ని పార్టీలను మద్దతు కోరుతున్న విజయ్
ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించేందుకు కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలకు టీవీకే ఆహ్వానం పలుకుతోంది. కాంగ్రెస్ తరువాత విజయ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI)ని మద్దతు కోరారు. ప్రభుత్వ ఏర్పాటులో తమకు సహకరించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ 2 చోట్ల విజయం సాధించింది. అయితే విజయ్ కు ఇతర పార్టీల నుంచి 11 వరకు ఎమ్మెల్యేల అవసరం ఉంది. విజయ్ రిక్వెస్ట్‌పై సీపీఐ స్పందించింది. ఈ విషయంపై రెండు రోజుల్లో జరిగే సీపీఐ కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. సీపీఎంకు సైతం విజయ్ పార్టీ మద్దతు కోసం ఆహ్వానం పంపనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో సీపీఎం సైతం 2 స్థానాల్లో నెగ్గింది.

కాంగ్రెస్ మద్దతు కూడగట్టిన విజయ్ ఒక్కో పార్టీకి ఆహ్వానాలు పంపుతూ తెలివిగా పావులు కదుపుతుండటంతో తమిళ రాజకీయ వేడెక్కుతోంది. వాస్తవానికి అధికారం కోసం డీఎంకే, అన్నాడీఎంకే సైతం విజయ్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి. కానీ ఆయా పార్టీల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

108 స్థానాలు నెగ్గిన తమిళగ వెట్రి కళగం
గత ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికల పోలింగ్ జరగగా, ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది. డీఎంకేపై వ్యతిరేకత, అటు మెయిన్ లీడర్ లేని అన్నాడీఎంకే లను కాదని ఈసారి తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారు. దాంతో సినిమాలు వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి స్టాలిన్ ప్రభుత్వానికి షాకిచ్చింది. టీవీకే ప్రభంజనానికి సీఎం ఎంకే స్టాలిన్ సైతం ఓటమిచెందారు.

పార్టీలు సాధించిన స్థానాలు:
టీవీకే - 108 స్థానాలు

డీఎంకే – 59 స్థానాలు

ఏఐఏడీఎంకే – 47 స్థానాలు

కాంగ్రెస్ – 5 స్థానాలు

పీఎంకే – 4 స్థానాలు

ఐయూఎంఎల్ – 2 స్థానాలు

సీపీఐ – 2 స్థానాలు

సీపీఎం – 2 స్థానాలు

వీసీకే – 2 స్థానాలు

బీజేపీ – 1 స్థానం

ఏఎంఎంకే – 1 స్థానం

డీఎండీకే – 1 స్థానం