Telangana EAPCET Results 2026 | హైదరాబాద్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎప్‌సెట్ (TG EAPCET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కేవలం 6 రోజుల్లోనే రికార్డ్ సమయంలో ఫలితాలు విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని ఈ మేరకు ఎప్‌సెట్ కన్వీనర్‌ ఆచార్య కె.విజయకుమార్‌రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ (JNTU-H) క్యాంపస్‌లో ఉదయం 11 గంటలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌ శ్రీదేవసేన, జేఎన్‌టీయూ-హెచ్‌ (JNTUH) వీసీ టి. కిషన్‌కుమార్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు.

రికార్డ్ సమయంలో ఎప్‌సెట్ 2026 ఫలితాలు
ఈసారి తెలంగాణ విద్యాశాఖ అత్యంత వేగంగా ఫలితాలు విడుదల చేసి రికార్డు సృష్టించింది. తెలంగాణ ఎప్‌సెట్ 2026 పరీక్షలు పూర్తయిన కేవలం 6వ రోజే ఫలితాలను విడుదల చేయడం విశేషం. విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉండేందుకు, కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ ఏడాది పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా విద్యార్థుల కంప్యూటర్‌ స్క్రీన్‌పై వారి మార్కులు నేరుగా చెక్ చేసుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులు, ఫలితాలను www.eapcet.tgche.ac.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.