<p><strong>Tirupati Corporation Deputy Mayor election:</strong> తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ ఉన్న టీడీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు కాకుండా.. ఇరవై నాలుగు మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు మద్దతు పలికారు. అదే సమయంలో.. వైసీపీకి సపోర్టుగా ఉన్న కొంత మంది ఓటింగ్ కు హాజరు కాలేదు. ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఓటింగ్ కు అనారోగ్య కారణాలతో గైర్హాజర్ అయ్యారు. దీంతో వైసీపీకి ఇరవై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చాయి. </p>
<p>కార్పొరేటర్లు అందరూ భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమన అందర్నీ నిలబెట్టుకుని గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు వారిలో అత్యధిక మంది <a title="టీడీపీ" href="https://telugu.abplive.com/topic/tdp" data-type="interlinkingkeywords">టీడీపీ</a> గూటికి చేరడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఎన్నిక ముగిసిన తర్వాత ముగ్గురు కార్పొరేటర్లు భూమన కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని కలిశారు. తాము డబ్బులు తీసుకోలేదని.. తమను బెదిరించడంతో కూటమి సభ్యులకు ఓటు వేయాల్సి వచ్చిందని వారు రోదిస్తూ భూమన కరుణాకర్ రెడ్డికి చెప్పారు. భూమన కాళ్లపై పడ్డారు. అయితే భూమన వారిని ఓదార్చారు. జరిగిందేదో జరగిపోయిందని సర్ది చెప్పారు. </p>