హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. పార్ట్ టైమ్ ఉద్యోగంలో భాగంగా పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడు కుంచ అన్షుల్ (28) ఉద్యోగం నిమిత్తం 2023లో అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం ఆయన నార్త్ ఫిలడెల్ఫియాలో ఉంటున్న అన్షఉల్ కేడబ్ల్యూసీ (KWC) అనే సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఖర్చులకు పనికొస్తుందని, అదనపు ఆదాయం కోసం వీకెండ్స్ పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

ఇంట్లోకి వెళ్లగానే కాల్పులు
శుక్రవారం రాత్రి ఎడ్‌గ్లీ స్ట్రీట్‌లోని రేమండ్ రోజెస్ హోమ్స్ వద్ద ఉన్న ఓ ఇంటి నుండి మూడు పిజ్జాల కోసం ఆర్డర్ వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటలకు కుంచ అన్షుల్ ఆ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్లాడు. తన వాహనం దిగి ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే, మాస్కులు ధరించిన కొందరు దుండగులు అన్షుల్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తల వెనుక భాగంలో బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావంతో అన్షుల్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. ఆ దారిలో వెళ్లే కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి

ఈ దారుణ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. హత్య జరిగిన స్థలంలో మూడు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక అమెరికా పోలీసులు తెలిపారు. ఈ విషాద వార్త తెలియడంతో గుండ్లపోచంపల్లిలోని అన్షుల్ నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి సహాయం చేయాలని మృతుడి సోదరి మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.

Also Read: Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు