BRS vs Congress Jurala water dispute Mahabubnagar:  తెలంగాణలో నీటి రగడ మళ్లీ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోలు గణనీయంగా తగ్గడంతో తాగు, సాగునీటి నిర్వహణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. రాబోయే జూన్ 2027 వరకూ తాగునీటి ఎద్దడి రాకుండా ప్రాజెక్టుల్లో కనీస మట్టాలను కాపాడుకోవాల్సి ఉండగా, పంటలు ఎండిపోతున్నాయనే సాకుతో సాగునీటికి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ జూరాల వేదికగా ఉద్యమానికి తెరలేపింది. జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళనలు, అరెస్టులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీశాయి.

ఏపీలో కుప్పంకు నీళ్లు తీసుకెళ్లారని బీఆర్ఎస్ ఆరోపణ

ఈ జల పోరాటం వెనుక బీఆర్ఎస్ స్పష్టమైన పొలిటికల్ రీజనింగ్ అప్లై చేస్తోంది. ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్‌కు నీళ్ల సెంటిమెంట్ అత్యంత శక్తివంతమైన అస్త్రం. ముఖ్యంగా సొంత జిల్లా పాలమూరుకు రేవంత్ రెడ్డి నీళ్లివ్వలేకపోతున్నారు, పక్క రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంకు నీరు తరలిస్తున్నారు అని పోల్చి చూపడం ద్వారా రైతాంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రతికూలత పెంచాలనేది కేటీఆర్ అండ్ టీమ్ ప్లాన్. త్వరలోనే దీన్ని రాష్ట్రవ్యాప్త రైతు ఉద్యమంగా మార్చి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. అయితే, ఈ రాజకీయ దాడిని కాంగ్రెస్ సర్కార్ అత్యంత వ్యూహాత్మకంగా ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ ఆరోపణలను కేవలం రాజకీయ వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, మూడు కోణాల్లో కౌంటర్ ఇస్తోంది.

ఇదీ నీటి నిల్వ పరిస్థితి

జూరాల పూర్తి సామర్థ్యం 9 టీఎంసీలు కాగా, అం దులో దాదాపు 3 టీఎంసీలు పూడికతో నిండిపోయిందని, మిగిలిన నీటిలో తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచడం సాంకేతిక బాధ్యత అని కాంగ్రెస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి వివరాలు వెల్లడిస్తున్నారు. పదేళ్ల పాలనలో అదనపు రిజర్వాయర్లు నిర్మించకుండా, ఉన్న నీటిని ఖాళీ చేసి తాగునీటి సంక్షోభం సృష్టించాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఎదురుదాడి చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఉదాహరణతో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌తో నేరుగా మాట్లాడి, ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలాకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున మంత్రుల బృందాన్ని బెంగళూరుకు పంపి సానుకూల స్పందన సాధించడం ద్వారా మేము సమస్య పరిష్కారానికి పనిచేస్తున్నాం అనే సంకేతాన్ని రైతుల్లోకి తీసుకెళ్లగలిగారు. ఎల్ నినో ప్రతికూలతల వల్ల తక్కువ నీటితో పండే పంటలను వేయాలని రైతులను కోరడమే కాకుండా, ఒకవేళ వర్షాభావంతో పంట నష్టం జరిగితే పరిహారం అందిస్తామని భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది.

రాజకీయాల్లో ఎవరిది పైచేయి

ఎల్ నినో సృష్టించిన నీటి ఎద్దడిని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే, శాస్త్రీయ నీటి యాజమాన్యం , పొరుగు రాష్ట్రంతో దౌత్య సంబంధాల ద్వారా ఆ కాకను తగ్గించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో కర్ణాటక నుంచి నీటి విడుదల ఎంత వేగంగా జరుగుతుందనే దానిపైనే ఈ జల రాజకీయం కాంగ్రెస్‌కు ప్లస్ అవుతుందా లేదా బీఆర్ఎస్‌కు మైలేజ్ ఇస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది.