హైదరాబాద్: తెలంగాణలో రానున్న ఆరు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ నెల 16 నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు ప్రారంభమై క్రమంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయని అంచనా వేసింది.

ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

రాష్ట్రంలో వర్షాల తీవ్రతను సూచిస్తూ అధికారులు ఎల్లో అలర్ట్ (10 సెం.మీ లోపు వర్షపాతం కురిసే అవకాశం) జారీ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతుండటం ఈ అకాల వర్షాలకు ప్రధాన కారణం. ఈ వర్షాల ప్రభావంతో 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టి, ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.

వర్షాలపై తెలంగాణ వెదర్ మ్యాన్ అలర్ట్..

తెలంగాణలో నేటి నుంచి 5 రోజులపాటు వర్షాలు కురవనున్నాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. మార్చి 16 నుండి 20 వరకు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు (మార్చి 16) మధ్యాహ్నం నుండి రాత్రి లోపు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో కరీంనగర్, హన్మకొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లోనూ భారీ వర్ష సూచన ఉందని తెలిపారు.

UNSEASONAL RAINS ALERT - MARCH 16 ⚠️

Today, scattered INTENSE THUNDERSTORMS ahead in Nizamabad, Kamareddy, Medak, Sangareddy , Vikarabad, Siddipet, Sircilla, Jangaon, Yadadri - Bhongir, Rangareddy, Mulugu, Bhupalapally, Mancherial, Asifabad, Bhadradri - Kothagudem during…

— Telangana Weatherman (@balaji25_t) March 16, 2026

హైదరాబాద్ నగరానికి సంబంధించి, మధ్యాహ్నం 4 గంటల తర్వాత మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 45 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన (Hailstorm) కురిసే అవకాశం కూడా ఉందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా మార్చి 18, 19 తేదీల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండబోతోందని అంచనా వేశారు.

వడగండ్లతో పాటు పిడుగులు పడే ప్రమాదం..

ఈ అకాల వర్షాల సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచించారు. కోతకు వచ్చిన పంటలను, ధాన్యాన్ని వర్షం, వడగళ్ల నుండి కాపాడుకోవడానికి వెంటనే గోడౌన్లు లేదా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లకు తరలించాలని కోరారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, బయటకు రాకూడదని హెచ్చరించారు. బలమైన ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగవచ్చు లేదా ప్రమాదాలు సంభవించవచ్చు. కనుక ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, వెదర్‌మ్యాన్ విజ్ఞప్తి చేశారు.